Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక, కర్షక ర్యాలీకి కళాకారుల సంఘీభావం
న్యూఢిల్లీ : ఆ గది ఓ చీకటి కొట్టు. దాని కిటికీ ఓ అడుగు పొడవు మాత్రమే ఉంటుంది. అందులో నుంచే సూర్యకాంతి ఆ గదిలో ప్రవేశిస్తుంది. అంత ఇరుకుగా ఉండే ఆ గదిలోనే కార్మికులు తమ పని చేసుకుంటూ పోతుంటారు. బట్టలు కుట్టడం, ఉతకడం, ప్యాక్ చేయడం వంటి పనులన్నీ అక్కడే జరుగుతుంటాయి. ఉత్తర ఢిల్లీలోని బాపూ నగర్లో కన్పించే దృశ్యాలివి. అక్కడ పని పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటాయి. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ యంత్రాలు విరామం లేకుండా పని చేస్తూనే ఉంటాయి. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుండి వలస కార్మికులు ఢిల్లీకి తరలివచ్చి అక్కడ పని చేసుకుంటూ జీవితాలు గడుపుతుంటారు. పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నప్పటికీ అక్కడ పనిచేస్తున్న కార్మికులు మాత్రం జననాట్య మంచ్ నిర్వహించిన వీధి నాటిక ప్రదర్శనను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బుధవారం నాడు రామ్‌లీలా మైదానంలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీకి కార్మికులను సమాయత్తం చేసేందుకు జననాట్య మంచ్ ఈ ప్రదర్శన నిర్వహించింది. నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని, కార్మికులకు నెలకు 26 వేల రూపాయల జీతం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు.
మంచ్ ప్రదర్శన ముగియగానే మనోజ్ గుప్తా అనే కార్మికుడు కళాకారులకు 50 రూపాయల విరాళం అందించారు. నాలుగు రోజులు పని చేసినందుకు గుప్తాకు 800 రూపాయల జీతం అందింది. అందులో నుంచే ఈ విరాళాన్ని అందజేశారు. తమ పరిస్థితిని ఈ ప్రదర్శన కండ్లకు కట్టినట్లు చూపిందని గుప్తా అభిప్రాయపడ్డారు. ఆయన మాట్లాడుతూ 'నేను పెయింటర్ని. నెలంతా పని దొరుకుతుంది. గ్యాస్ సిలిండర్, కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగాయి. గ్రామాల్లో పని లేదు. అందుకే ఢిల్లీ వచ్చాం. అయితే ఇక్కడ రోజు గడవడం కష్టంగా ఉంది. నా పిల్లల కోసం దాచుకునేందుకు ఏమీ మిగలడం లేదు' అని చెప్పారు. ఇక తన జీవితమంతా బట్టలు కుడుతూనే ఉన్న దాతారామ్ అనే కార్మికుడు తన లాంటి పెద్దలకు నెలకు 10 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 'పొదుపు అనేదే లేని మా లాంటి వారు ఎలా బతకగలరు? ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మందుల ధరలు కూడా పెరుగుతున్నాయి. నా మధుమేహం మందుల కోసం నెలకు 2,500 రూపాయలు ఖర్చు చేస్తున్నాను' అని ఆయన వాపోయారు. దాతారామ్, గుప్తాలు ర్యాలీలో భాగస్వాములయ్యే అవకాశాలు పెద్దగా లేకపోయినప్పటికీ సీఐటీయూ చేపట్టిన ప్రచారం వారిని కదిలించింది. కరోల్‌బాగ్‌లో ప్రచార కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్న అజరు సైన్ వీధి వ్యాపారుల కార్మిక సంఘానికి చెందిన వ్యక్తి. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మికులను సమీకరించడంలో వీధి ప్రదర్శన ఎంతగానో దోహదం చేస్తోందని ఆయన అన్నారు. 'ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోవడంతో దానిని పూడ్చుకునేందుకు వీరంతా వీధి వ్యాపారులుగా మారారు. ఫ్యాక్టరీలు పూర్తి సామర్ధ్యంతో పని చేయడం లేదు. వాటి యజమానులు చేసిన పనికి మాత్రమే కార్మికులకు జీతాలు అందిస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ కార్మికుడు రాత్రి సమయంలో వీధి వ్యాపారిగా మారాడు. అధికారులేమో వీరికి వ్యాపారం చేసుకునేందుకు లైసెన్సులు ఇవ్వడం లేదు. దీంతో వీరు పోలీసులకు లంచాలు ఇవ్వాల్సి వస్తోంది' అని ఆయన వివరించారు. అయినప్పటికీ వీధి వ్యాపారులు ఇప్పుడు పాలకులకు లక్ష్యంగా మారారు. వేర్వేరు జీ 20 సదస్సులకు హాజరయ్యే విదేశీ ప్రతినిధుల కోసం ఢిల్లీ వీధులను పాలకులు శుభ్రం చేయిస్తున్నారు. వారు వీధి వ్యాపారులను తమ కార్యకలాపాలు చేసుకోనివ్వడం లేదు. 'సివిల్ లైన్స్, సెంట్రల్ ఢిల్లీ జోన్లలో అధికారులు దాష్టీకం చెలాయిస్తున్నారని వీధి వ్యాపారులు మాకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇది వారి జీవనాధారంపై నేరుగా దాడి చేయడమే. కార్మికుల కుటుంబాలు అధికారులకు పట్టవు. జనంతో నిమిత్తం లేకుండా ఢిల్లీ వీధులను తళతళలాడేలా చేయడమే వారి లక్ష్యం. వీధి వ్యాపారులు ర్యాలీకి హాజరు కావడానికి ఇది కూడా ఒక కారణం' అని సైనీ వివరించారు.
కళాకారులు కార్మికులు, రైతులతో కలిసి ముందుకు సాగుతున్నారని జననాట్య మంచ్ సభ్యులు కొమితా ధండా చెప్పారు. కళను వేరుగా చూడలేమని, అది సమాజంలో భాగమని ఆమె అన్నారు. ఆలోచించే ప్రతి వ్యక్తీ ఈ సమయంలో పెదవి విప్పాల్సి ఉంటుందని, సెన్సార్ పేరిట కళాకారుల పైన కూడా దాడి జరుగుతోందని చెప్పారు. 'ఇది రైతులు, కార్మికులు, కళాకారుల సంయుక్త పోరాటం' అని అభివర్ణించారు.
దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మధ్య వేతన స్థాయిల్లో ఉన్న వ్యత్యాసం కార్మికుల పాలిట శరాఘాతంగా మారిందని ఢిల్లీ సీఐటియూ ప్రధాన కార్యదర్శి అనురాగ్ సక్సేనా చెప్పారు. 'ఢిల్లీలో నైపుణ్యం లేని కార్మికుడి నెలసరి వేతనం 16,792 రూపాయలు. అదే ఉత్తరప్రదేశ్‌లో రూ 9,743. అయితే ఢిల్లీలో కనీస వేతనాలు సరిగా అమలు కావడం లేదు. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో జీవన ప్రమాణాలు, ద్రవ్యోల్బణ రేటు, నిత్యావసరాల ధరలు ఒకేలా ఉంటాయి. కాబట్టి ఢిల్లీలో ఇచ్చే వేతనాలకు సమానంగా ఇతర ప్రాంతాల వారికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది' అని తెలిపారు. నెలకు రూ 26,000 వేతనం ఇవ్వాలన్నది ఒక్క సీఐటీయూ డిమాండ్ మాత్రమే కాదని చెప్పారు. దీనిపై అన్ని కార్మిక సంఘాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా, వీధి ప్రదర్శనల ద్వారా సమస్యలపై కార్మికులు, ప్రజలకు చేరువ అయ్యేందుకు సీఐటీయూ అనుబంధ సంఘాలు చర్యలు చేపట్టాయని చెప్పారు. 'ప్రజాభిప్రాయ సేకరణలో కార్మికులు తమ సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరైన న్యాయవాదులు, మేధావులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు వారికి ఏమైనా సాయం చేయగలమేమోనని చూస్తున్నారు. ఇప్పటివరకూ 40 ప్రదర్శనలు ఇచ్చిన జననాట్యమంచ్ సహాయం కూడా తీసుకుంటున్నాము. వీధి సమావేశాలు వంటి సంప్రదాయ పద్ధతుల ద్వారా ప్రజలను సమీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నాము' అని తెలిపారు.