Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ముక్కోణపు ప్రేమకథ
- కాంగ్రెస్‌కు తెలంగాణలో 80 సీట్లు : రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో బీఆర్ఎస్తో తమకు ఎటువంటి పొత్తు ఉండదని టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య ముక్కోణపు ప్రేమ కథ నడుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబం చేసిన రూ.లక్ష కోట్ల అవినీతిపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను టీపీసీసీ చీఫ్‌గా ఉన్నంత కాలం బీఆర్ఎస్తో కాంగ్రెస్ చేతులు కలపబోదనీ, కేసీఆర్‌పై పోరాటం చేయాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తనకు సలహా ఇచ్చారని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో కలయిక ధృతరాష్ట్ర కౌగిలి అనీ, అందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని అన్నారు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దారుణ ఓటమి పాలవుతుందనీ, 25 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు 80 సీట్లు వస్తాయని నొక్కి చెప్పారు. తెలంగాణలో బీజేపీకి సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని స్పష్టం చేశారు. బండి సంజరు ఈసారి కరీంనగర్ లో పోటీచేసి గెలవగలరా? అని సవాల్ విసిరారు. వైఎస్ షర్మిల పార్టీ ఎన్జీవో సంస్థగా పని చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతోనే ప్రశ్నాపత్రాలు లీకలవుతున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. పదో తరగతి మొదలు టీఎస్పీఎస్సీ వరకు వ్యవస్థలన్నీ కుప్పకూలాయన్నారు. లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగులతో సీఎం చెలగాటమాడుతున్నారని, కెసిఆర్‌కు ఒక క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని విమర్శించారు. ఇక పరీక్షలను రద్దు చేయడం కాదని, ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ రాజకీయాలను కార్పొరేటీకరణ చేస్తే, రాష్ట్రంలో కెసిఆర్ రాజకీయాలను మాఫియా చేశారని విమర్శించారు. అలాంటి పార్టీలతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపదని దుయ్యబట్టారు.