Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏచూరితో సహా సీపీఐ(ఎం) సీనియర్ నేతల సంతాపం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం నేత సునీత్ చోప్రాకి వేలాది మంది తుడివీడ్కోలు పలికారు. మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. భౌతికకాయాన్ని బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఎకేజీభవన్)లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు వేలాదిగా తరలివచ్చారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, బృందా కరత్, ఎంఏ బేబి, బీవీ. రాఘవులు, నీలోత్పల్ బసు, తపన్‌సేన్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయరాఘవన్, బి.వెంకట్, ఎంపీ. వి శివదాసన్, ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజ్జూ కృష్ణన్, అశోక్ ధావలే, ఉపాధ్యక్షులు హన్నన్ మొల్లా, డీవైఎఫ్ఐ అధ్యక్షుడు, ఎంపీ ఎఎ రహీం, ప్రధాన కార్యదర్శి హిమఘ్నరాజ్ భట్టాచార్య, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీపీ.సానూ, మయూఖ్ బిశ్వాస్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం దావలే, ఐద్వా నేత మెమూనా మొల్లా తదితరులు నివాలులర్పించారు. ఆర్టిస్టులు, ఆర్ట్ క్రిటిక్స్, ఉత్తర కొరియా ప్రతినిధులు, జెఎన్‌యు, ఢిల్లీ యూనివర్శిటీ వంటి విద్యాసంస్థల విద్యార్థులు, జర్నలిస్టులు తదితరులు సునీత్ చోప్రాను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అంతిమ నివాళులర్పించేందుకు వచ్చిన పలువురు భావోద్వేగానికి గురయ్యారు. తమ ప్రియమైన సహచరుడిని చూసి ఉత్తర కొరియా ప్రతినిధులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సునీత్ చోప్రా భార్య సుమిత్రా చోప్రా, సోదరీమణులు, బంధువులు కూడా హాజరయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు లోథిరోడ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.