Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిలబస్ నుంచి మొఘలుల చాప్టర్లు తొలగింపు
- గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్‌పై నిషేధం కూడా..
- నూతన విద్యా విధానాన్ని పాటిస్తున్నాం : ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ సక్లానీ
- తొలగింపులపై ప్రతిపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో విద్య కాషాయీకరణలో భాగంగా కేంద్రంలోని మోడీ సర్కారు ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నది. గత చరిత్రను చెరిపివేసి వక్రీకరణలతో విద్యార్థుల మెదళ్లను కలుషితం చేసే చర్యకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కు చెందిన పలు తరగతుల పాఠ్యపుస్తకాల సిలబస్‌ల నుంచి అనేక చాప్టర్లను తొలగించింది. ఇందులో మొఘలు, గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్‌పై నిషేధం, హిందూ-ముస్లింల ఐక్యతకు గాంధీ చేసిన కృషితో పాటు పలు కీలక చాప్టర్లు, అంశాలు, పేరాగ్రాఫ్‌లు ఉన్నాయి. దీంతో ఈ చర్యపై రాజకీయంగా అనేక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
'అతివ్యాప్తి.. అసంబంద్ధం'
తమకు, తమ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న చాప్టర్ల తొలగింపునకు మోడీ సర్కారు చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగానే నూతన విద్యా విధానం(ఎన్ఈపీ) 2020ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ
ఎన్ఈపీ ఆధారంగానే సిలబస్‌లో ఇలాంటి మార్పులు చోటు చేసుకున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. గతేడాది సిలబస్ హేతు బద్దత ప్రక్రియలో భాగంగా మొఘలులకు సంబం ధించిన పాఠాలను తొలగించడానికి ఎన్సీఈఆర్టీ వాటిని 'అతివ్యాప్తి', 'అసంబద్ధ'మైనవంటూ కారణా లుగా పేర్కొనటం గమనార్హం.
తొలగించిన చాప్టర్లు ఏమిటి?
- 'థీమ్స్ ఆఫ్ ఇండియాన్ హిస్టరీ-పార్ట్ 2' నుంచి 'కింగ్స్ అండ్ క్రోనికల్స్ : ది మొఘల్ కోర్ట్స్ (16 మరియు 17వ శతాబ్దాలు)'కు సంబంధించిన చాప్టర్లు.
- 11వ తరగతిలో సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్, సంస్కృతుల ఘర్షణ, పారిశ్రామిక విప్లవం.
- 12వ తరగతి పౌరశాస్త్రం పుస్తకం 'స్వాతంత్య్రం నుంచి భారత రాజకీయాలు'లో 'రైస్ ఆఫ్ పాపులర్ మూవ్మెంట్స్', 'ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్'.
- పదో తరగతి డెమోక్రాటిక్ పాలిటిక్స్-2 పుస్తకాల నుంచి 'డెమోక్రసీ అండ్ డైవర్సిటీ', 'పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్', 'ప్రజాస్వామ్యానికి సవాళ్లు'.
- 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకం నుంచి మహాత్మా గాంధీ హత్యానంతరం ఆరెస్సెస్‌పై విధించిన నిషేధానికి సంబంధించిన కొన్ని పేరాలను తొలగించారు. అలాగే, హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీ చేపట్టిన కృషికి సంబంధించిన పేరాలను కూడా తొలగించారు.
చాప్టర్ల తొలగింపుపై ఎన్సీఈఆర్టీ ఏం చెప్పింది?
దీనిపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ మాట్లాడుతూ.. '' కోవిడ్ కారణంగా గతేడాది హేతుబద్దీకరణ ప్రక్రియ సాగింది. అప్పుడు విద్యార్థులపై ఒత్తిడి పడింది'' అని చెప్పారు. ఆరు నుంచి 12వ తరగతులకు చెందిన పుస్తకాలను నిపుణుల కమిటీలు పరిశీలించాయన్నారు. చాప్టర్లను తొలగించడం వల్ల పిల్లల నాలెడ్జ్‌పై ప్రభావం చూపవని నిపుణులు తెలిపిన తర్వాత తొలగింపులు జరిగాయనీ, ఈ చర్చ అనవసరమని అన్నారు. ''మేము నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రకారం పని చేస్తున్నాం. కంటెంట్ లోడ్‌ను తగ్గించుకోవడం గురించి ఎన్ఈపీ 2020 చెబుతుంది. దానినే మేము అమలు చేస్తున్నాం. పాఠశాల విద్య కోసం నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఎఫ్) ఏర్పాటైంది. ఇది త్వరలో ఖరారవుతుంది. ఎన్ఈపీ ప్రకారం 2024లో పాఠ్యపుస్తకాలు ముద్రించబడతాయి'' అని అన్నారు.
చరిత్ర సిలబస్ మార్పుపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి?
ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో కేంద్రం మార్పులకు సంబంధించి ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోడీ సర్కారు ప్రయత్నాలను తప్పుబట్టాయి. మొఘలుల చరిత్రను తొలగించడం ద్వారా గతాన్ని కేంద్రం తుడిచివేస్తున్నదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఇది దేశ చరిత్రను మార్చే ప్రయత్నమని కాంగ్రెస్ నాయకుడు అవినాశ్ పాండే అన్నారు. కేంద్రంపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ దాడికి దిగారు. ''హిందూ, ముస్లింల ఐక్యతకు గాంధీ తపన, ఆరెస్సెస్‌పై నిషేధం, గుజరాత్ అల్లర్లకు సంబంధించిన అన్ని రిఫరెన్సులు, సమకాలీన భారతదేశంలో సామాజిక ఉద్యమాలుగా మారిన నిరసనలు'' వంటివి ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించబడ్డాయని ఆయన ట్వీట్ చేశారు.