Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పేరుతో పౌర హక్కులు నిరాకరిస్తున్నారు
- మీడియా వన్‌పై నిషేధం చెల్లదు: కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
- ప్రజాస్వామ్య బలోపేతానికి స్వతంత్ర మీడియా అవశ్యమని హితవు
న్యూఢిల్లీ : రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను హరించివేయడానికి జాతీయ భద్రతను ఒక సాధనంగా ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని, ఇది చట్టబద్ధపాలనకు అనుగుణంగా లేదని సుప్రీం కోర్టు బుధవారం
వ్యాఖ్యానించింది. మలయాళం వార్తా చానెల్ 'మీడియా వన్'పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేదాన్ని రద్దు చేసింది. ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కార్‌కు సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. ప్రభుత్వ విధానాలను విమర్శించడమనేది మీడియా లేదా టెలివిజన్ చానెల్ లైసెన్స్‌ను రద్దు చేయడానికి ఒక కారణం కారాదని సుప్రీం స్పష్టం చేసింది. భద్రతా
కారణాల రీత్యా మీడియావన్ ప్రసారాలను నిషేధించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మీడియా వన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. పౌరుల హక్కులను నిరాకరించడానికి జాతీయ భద్రతను ప్రభుత్వం సాకుగా చూపుతోందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర హోంమంత్రిత్వశా ఖను తీవ్రస్థాయిలో మందలించింది. ఇలాంటి స్వల్ప విషయాలకు జాతీయ భద్రతను క్లెయిమ్ చేయలేమని, వాటికి మద్దతుగా పాదార్ధిక వాస్తవాలు వుండాలని వ్యాఖ్యానించింది. 'ప్రజాస్వామ్య రిపబ్లిక్ క్రియాశీలంగా పనిచేయడానికి స్వతంత్రంగా పనిచేసే మీడియా చాలా కీలకం. ప్రజాస్వామ్య సమాజంలో దాని పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రభుత్వ పనితీరుపై ఇదొక వెలుగునిస్తుంది. వాస్తవాలు మాట్లాడాల్సిన, పౌరులకు కఠోరమైన వాస్తవాలను అందచేయాల్సిన, ప్రజాస్వామ్యాన్ని సరైన దిశలోకి నడిపించే బాధ్యత మీడియాకు వుంటుంది. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తే పౌరులు కూడా అదే పద్దతిలో ఆలోచించాల్సి వుంటుంది. సామాజిక ఆర్థిక రాజకీయాల నుండి రాజకీయ సిద్ధాంతాల వరకు అనేక అంశాలపై సజాతీయ వీక్షణ వల్ల ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది' అని కోర్టు పేర్కొంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రతా అనుమతిని తిరస్కరించడానికి గల కారణాలను వెల్లడించకుండా కేవలం కోర్టుకు సీల్డ్ కవర్లో అందచేయడమనేది సహజ న్యాయ సిద్ధాంతాలను, న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కును ఉల్లంఘించిందని కోర్టు పేర్కొంది. చీకటిలో పోరాటానికి సదరు సంస్థను నెట్టిందని పేర్కొంది.
సీల్డ్ కవర్ పద్ధతిపైనా తలంటిన ధర్మాసనం
జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై విచారణ సందర్భంగా సీల్డ్ కవర్ అందచేసే పద్ధతిని కోర్టులు అనుసరించడానికి సమగ్ర మార్గదర్శకాలను విధించింది. ''ప్రజా రక్షణ చర్యల ద్వారా పరిష్కరించలేని ప్రమాదాలను కప్పిపుచ్చడా నికి సీల్డ్ కవర్ పద్ధతిని ప్రవేశపెట్టలేం. జాతీయ భద్రతా ప్రయోజనాలను పరిశీలించేటపుడు సహజ న్యాయ సిద్ధాంతాలను మినహాయించవచ్చు, కానీ, మొత్తంగా విషయాన్ని కప్పిపుచ్చడాన్ని అనుమతించలేం. సహజన్యాయం, బహిరంగ న్యాయ సిద్ధాంతాలను సీల్డ్ కవర్ పద్ధతు ఉల్లంఘిస్తుంది.'' అని కోర్టు పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టం, 2019, జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సి)పై చానెల్ ఇచ్చిన కథనాన్ని, న్యాయ వ్యవస్థను, ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని ప్రాతిపదికగా చేసుకుని చానెల్‌ను ప్రభుత్వ వ్యతిరేకిగా ముద్ర వేయడాన్ని ఏ మాత్రమూ సమర్ధించలేమని బెంచ్ రూలింగ్ ఇచ్చింది. అన్ని ఇంటెలిజెన్స్ నివేదికలను రహస్యంగా పేర్కొలేమని, ఎందుకంటే ఇవి పౌరుల హక్కులు, స్వేచ్ఛను ప్రభావితం చేస్తాయని బెంచ్ పేర్కొంది.