Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ నయా ఉదారవాద పాలన ప్రమాదకరం : ప్రభాత్ పట్నాయక్
ప్రజలపై మోడీ సర్కార్ దాడి తీవ్రతరం చేసిందని మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ ఆహ్వాన సంఘం చైర్మెన్, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ విమర్శించారు. దేశంలో నయా ఉదారవాద పాలన కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలపై తీవ్ర దాడిని ప్రారంభించిందన్నారు. దీంతో రెండు దశాబ్దాలుగా మూడు లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ దాడి మరింత తీవ్రమైందన్నారు. ఎన్ఎస్ఎస్ డేటా ప్రకారం 2011-12 నుంచి 2017-18 మధ్య గ్రామీణ భారతదేశంలో తలసరి వాస్తవ నెలవారీ వ్యయం 9 శాతం క్షీణించిందని తెలిపారు. ఈ డేటాను పూర్తిగా అణచివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్లు, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలతో ఈ అధిక దాడిని సంస్థాగతీకరించడానికి ప్రయత్నించిందని చెప్పారు. అయితే, రైతుల వీరోచిత ప్రతిఘటనతో మోడీసర్కారు కాస్త వెనక్కి తగ్గిందనీ, కానీ, అది తన ఉద్దేశాన్ని వదులుకోలేదని విమర్శించారు.
వ్యవసాయ కార్మికులు ఉపాధికి దూరమవుతున్న తీరును వివరించారు. మోడీ విధానాలతో నష్టపోయేది కేవలం ఆ వర్గాలే కాదనీ, దేశం మొత్తం అగాధంలోకి నెట్టబడుతున్నదని విమర్శించారు. ఆహార ధాన్యాల సాగు నుంచి రైతులను దూరం చేస్తున్నారనీ, ఇది ఆహార భద్రతను దెబ్బతీస్తుందని అన్నారు. సంపద అసమానతల్లో తీవ్ర పెరుగుదల ఉందనీ, అసమానతలు అరికట్టాల్సిన మోడీ సర్కారు దాన్ని విస్మరించిందని విమర్శించారు. మరోవైపు కార్పొరేట్ ధనికులకు పన్ను రాయితీలు ఇస్తున్న తీరును ఎండగట్టారు. ''క్రోనీ క్యాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడి)'' బహిరంగంగా, విచ్చలవిడిగా నాట్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారందరినీ భయభ్రాంతులకు గురిచేయడం, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను అంతమొందించడానికి ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా విషపూరితమైన ద్వేషాన్ని పెంచుతున్నారని పేర్కొన్నారు. శ్రామిక ప్రజలపై దాడికి వ్యతిరేకంగా పోరాడటానికి, ప్రజాస్వామ్యాన్ని, ప్రతిఘటించే హక్కును రక్షించడానికి, దేశాన్ని లౌకిక గణతంత్ర రాజ్యంగా పరిరక్షించడానికి, ఆధునిక భారతదేశం నిర్మించిన రాజ్యాంగాన్ని కాపాడటానికే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు వచ్చారన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షులను ప్రకటించారు.