Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్షలాదిగా తరలొచ్చిన కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని హస్తిన ఎర్ర రంగు పులుముకుంది. ఢిల్లీ వీధుల్లో అరుణ పతాకాలు రెపరెపలాడాయి. దీంతో ఢిల్లీ అరుణార్ణవ రాజధానిగా మారింది. భూజాలపై ఎర్ర జెండాలు మోస్తూ కార్మిక, కర్షకులు కదంతొక్కారు. డప్పుల మోతలు, కష్ట జీవుల గొంతెత్తిన పాటలు మోడీ సర్కార్‌ను హెచ్చరించాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి గౌహతి వరకు దేశ నలుమూల నుంచి భారీగా తరలివచ్చిన కష్ట జీవులతో దేశ విశిష్టమైన భిన్నత్వంలో ఏకత్వం ఢిల్లీ నగరంలో ప్రస్ఫుటించింది. ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేసేందుకు రాజకీయ మార్పులే లక్ష్యంగా ఎర్ర జెండాలతో తరలివచ్చిన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు మహానగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మోడీ హటావో దేశ్ బచావో అంటూ దేశ నడిబొడ్డిన గొంతెత్తి నినదించారు. హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు వివిధ ప్రాంతీయ భాషల్లో కార్మిక, కర్షకులిచ్చే నినాదాలతో దేశ రాజధాని దద్దరిల్లింది. బుధవారం రాంలీలా మైదానంలో 13 డిమాండ్ల సాధనం కోసం సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో భారీ మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ మార్చ్ జరిగింది. లక్షలాది మంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మి కులు హాజరు కావడంతో రాంలీలా మైదానం కిక్కిరిసి పోయింది. హర్యానా, పంజాబ్, రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర , ఆంద్ర óప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అసోం, త్రిపుర, మణిపూర్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్ రాష్ట్రాల కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.
గర్జించిన కష్టజీవులు
దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కష్టజీవులు వారి జీవనోపాధిపై జరుగుతున్న దాడిని ఆపాలనీ, ఉచిత విద్య, వైద్యం అందించాలనీ, గౌరవప్రదమైన జీవితం కావాలని గర్జించారు. 'నమో.. నో మోర్' అంటూ మోడీ ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. ఈశాన్య రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికులు, రైతులు సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు.
బీజేపీ సర్కార్‌పై కన్నెర్ర
దేశ సంపదను నాశనం చేసే బిజెపి ప్రభుత్వంపై కార్మికులు, రైతులు, వ్యవ సాయ కార్మి కులతో కూడిన ఐక్య ప్రతి ఘటన ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రామిక ప్రజల జీవితాలను అగాధం లోకి నెట్టే తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి దృష్టిని మరల్చేం దుకు మోడీ సర్కార్ చేసే విద్వేష ప్రచారాలకు వ్యతిరేకిం చింది. బడా కార్పొరేట్ శక్తులకు లాభాల వర్షం కురిపిస్తూ, తమ ప్రాథ మిక అవసరాలను పట్టిం చుకోక పోవడంపై దేశంలోని శ్రామిక ప్రజల ఆగ్రహానికి ఈ ర్యాలీ నిదర్శనమని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ యజమానులకు విక్రయిం చడం, కార్మికులు, రైతుల ప్రాథమిక హక్కులను హరించడం, దేశీయ వ్యవసాయం, పాడి పరిశ్రమలను స్వాధీనం చేసుకునేందుకు విదేశీ పెట్టుబడిని ఆహ్వానించడం, ప్రజల కష్టాలను దోచుకోవడంలో అవినీతిపరులకు సాయం చేయడం ఇకపై సాగనీయమని ప్రకటించింది. సంపన్న వ్యాపార సంస్థల చేతుల్లో దేశం బందీ కాకుండా కాపాడటానికి కార్మికులు, రైతులు చేతులు కలిపి దేశవ్యాప్తంగా ఉధృతమైన ఉద్యమాన్ని ప్రారంభిం చినట్లు పేర్కొంది.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
రాంలీలా మైదానంలోని వేదికపై ఉదయం 8 గంటల నుంచి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్మిక, కర్షకులను ఆకట్టు కున్నాయి. జన నాట్య మంచ్, జన సంస్కృతి వంటి సంఘాల కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రజలపై మోడీ సర్కార్ చేసే కుతంత్రాలను, ప్రజల సమస్యలను వివరిస్తూ కవితలు, నాటికలు, గీతాలాపనలు చేశారు. సభ ప్రారంభానికి ఏఐఏడబ్ల్యూయూ మాజీ సహాయ కార్యదర్శి సునీత్ చోప్రా హఠాన్మరానికి సంతాపం తెలిపారు.
సీపీఐ(ఎం) సంఘీభావం
ర్యాలీలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బృందా కరత్, బీవీ రాఘవులు, ఎంఏ బేబి, నీలోత్పల్ బసు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీపీ సానూ, మయూక్ బిశ్వాస్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, కోశాధికారి ఎస్. పుణ్యవతి వంటి వివిధ సంఘాల నేతలూ సంఘీభావం ప్రకటించారు.
నలుమూలల నుంచి ర్యాలీలు
తొలుత దేశ రాజధాని ఢిల్లీ నలుమూలల నుంచి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ర్యాలీలు రాంలీలా మైదానానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (అజ్మీరీ గేట్), పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ (శిష్ గంజ్ గురుద్వారా), సరారు రోహిల్లా రైల్వే స్టేషన్ (గురుద్వారా రకబ్ గంజ్), గురుద్వారా బంగ్లా సాహెబ్, అంబేద్కర్ భవన్ నుంచి ఐదు ప్రధాన ప్రదర్శనలు, వీటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి చిన్న చిన్న ర్యాలీలు రాంలీలా మైదానానికి చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ర్యాలీలు, మధ్యాహ్నం రెండు గంటల వరకు రాంలీలా మైదానానికి వస్తూనే ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు క్రమ శిక్షణతో నినాదాలిచ్చుకుంటూ ముందుకు సాగారు.
ఎర్ర సముద్రంలో మహిళా సత్తా
ఢిల్లీని ఎర్రని సముద్రంగా మార్చిన మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సత్తా చాటారు. నిర్వాహకుల అంచనాలను సైతం తలకిందులు చేస్తూ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు అపూర్వంగా పాల్గొన్నారు. అసోంకు చెందిన 1,500 మంది ప్రతినిధులలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. మహారాష్ట్ర, బెంగాల్, రాజస్థాన్, మణిపూర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది మహిళలు హాజరయ్యారు. రైతుల విజయం, అంగన్వాడీ ఉద్యమ విజయం ఉత్తర భారత గ్రామాల్లో మహిళల భాగస్వామ్యానికి నిదర్శనం. అంగన్వాడీ ఫెడరేషన్ బలమైన పోరాటాలను నిర్వహిం చిన హర్యానా నుంచి ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు.
- తమ బ్యాగులు, ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న వస్తువులను భూజాల పెట్టుకొని, నెత్తిపై మోసుకుంటు ర్యాలీలో కదిలిన కార్మిక, కర్షకులు
- దారిపొడువునా మోడీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాల హోరు
- కాలినడక చెప్పులు లేకుండా అనేక మంది ర్యాలీలో కనిపించారు
- అత్యధిక భాగం మహిళలు ప్రదర్శనలో భాగస్వామ్యం అయ్యారు.
- ఎక్కడా ఎలాంటి అవాఛనీయ ఘటన తలెత్తకుండా క్రమశిక్షణతో మెలిగిన కార్మిక, కర్షకులు
- వివిధ రాష్ట్రాల కార్మిక, కర్షకులు ప్రాంతీయ భాషల్లో నినాదాలు
- అస్సాం, మణిపూర్ వంటి ఈశాన్య, రాజస్థాన్, హర్యానా వంటి ఉత్తరాది రాష్ట్రాల మహిళ తమ రాష్ట్రాల సాంప్రదాయ వస్త్రాధారణలో కనిపించారు.
- కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల పురుషులు సాంప్రదాయ దోతి (లుంగీ) వస్త్రాదారణతో కనిపించారు.
- ఉత్తరాది రైతులు తమ సాంప్రదాయ సిలకట్టును, తలపాకాతో పురుషులు హాజరయ్యారు.
- సోదర సంఘాల సంఘీభావం
- ఎర్ర సముద్రంలా మారిన రాంలీలా మైదానం
- ఆలోచింప చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు
- వేదిక వద్ద లాల్ సలామ్, రెడ్ సెల్యూట్ నినాదాలు