Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ నుంచి విజరు చౌక్ వరకు ప్రతిపక్షాల తిరంగా మార్చ్
- అడ్డుకున్న పోలీసులు
- అదానీపై జేపీసీ వేయడానికి మోడీ సర్కార్‌కు భయం : ప్రతిపక్షాలు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్లో ప్రతిపక్షాలు తిరంగా మార్చ్ నిర్వహించాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగింపు రోజు గురువారం ప్రతిపక్ష నేతలంతా జాతీయ జెండాలు పట్టుకుని పార్లమెంటు నుంచి విజరు చౌక్ వరకు తిరంగా మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌ను పార్లమెంట్ గేట్ నంబర్ 1 వద్ద జాతీయ జెండా పట్టుకొని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎంపీలు పెద్ద పెట్టున నినాదాల హౌరెత్తించారు. విజరు చౌక్‌కు చేరుకున్న తిరంగా మార్చ్‌ను అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికే భారీగా ఏర్పాటు చేసిన బారికేడ్లతో ప్రతిపక్ష నేతలు అడ్డుకున్నారు. అదానీపై సమగ్ర విచారణకు జేపీసీ వేయాలని, రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటీ, ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్, బీఆర్ఎస్, జేడీయూ, ఎన్సీపీ, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, శివసేన (ఠాక్రే), వీసీకే, నేషనల్ కాన్పరెన్స్, ఆర్ఎల్డీ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే తదితర పార్టీలు ఆందోళనలో భాగస్వామ్యం అయ్యాయి.
మోడీ సర్కార్‌కు ఎందుకంత భయం..
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ప్రతిపక్ష పార్టీల నేతలు ఎండగట్టారు. కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పేరుకే ప్రజాస్వామ్యమని అంటుంటారనీ, ఆచరణలో ఉండదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అదానీ-హిండెన్‌బర్గ్ సమస్యపై జేపీసీ ఎందుకు వేయరనీ, ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలు సాఫీగా నడవనీయకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ధ్వజమెత్తారు. 'పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండానే.. 12 నిమిషాల్లోనే రూ. 50 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పైగా ప్రతిపక్ష పార్టీలు సహకరించడం లేదని ఆరోపించింది' అని ఖర్గే మండిపడ్డారు. అధికార పార్టీ ప్రతినిధులే పార్లమెంట్లో గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు సభలో మాట్లాడేందుకు అనుమతించలేదని, తన 52 ఏండ్ల ప్రజాజీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. దీని వెనుక ఏదో మతలబు దాగుందని, అందుకే జేపీసీ విచారణకు అంగీకరించడం లేదని ఆరోపించారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో సమాధానం చెప్పకుండా.. బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ అందరి దృష్టిని మళ్లించిందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీఆర్ బాలు (డీఎంకే), సంజరు సింగ్ (ఆప్), కే.కేశవరావు (బీఆర్ఎస్), వి.శివదాసన్ (సీపీఐ(ఎం), బినరు విశ్వం(సీపీఐ), మనోజ్ కుమార్ ఝా (ఆర్జేడీ), ప్రసూన్ బెనర్జీ (టీఎంసీ), కౌశలేంద్రకుమార్ (జేడీయూ), ఎస్.టీ హసన్ (ఎస్పీ), మహ్మద్ బషీర్ (ఐయుఎంఎల్), ప్రియాంక చతుర్వేది (శివసేన, ఠాక్రే), ఎన్‌కె ప్రేమ్‌చంద్రన్ (ఆర్ఎస్పీ), మహువా మాజి (జెఎంఎం), తిరుమావలవన్ (వీసీకే) తదితరులు పాల్గొన్నారు.
లోక్‌సభ స్పీకర్ ఆతిథ్యం.. ప్రతిపక్షాలు బహిష్కరణ
పార్లమెంట్ ముగిసిన తరువాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆతిథ్యం ఇచ్చే సంప్రదాయ 'ఈవినింగ్ టీ'ని ప్రతిపక్ష నేతలు బహిష్కరించాయి. టీ పార్టీకి ప్రతిపక్ష పార్టీల ఎంపీల్లో ఒకే ఒక్కరు హాజరయ్యారు. మిగిలిన ప్రతిపక్ష పార్టీల నుంచి నేతలు వెళ్లలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా మాత్రమే హాజరయ్యారు. ఆ సమయంలో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు అక్కడే ఉన్నారు. ఫరూఖ్ అబ్దుల్లాతో కలిసి ముచ్చటించుకుంటూ అందరూ తేనీరు సేవించారు.