Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్రవ్యోల్బణం ఎఫెక్ట్
- కోవిడ్ అనంతరం మారిన పరిస్థితి
ప్రతి ఇంటికీ అవసరమైన పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ అమలు చేయొద్దని ఎన్ని విన్నపాలు చేసినా కేంద్రం వినిపించుకోలేదు. అంతిమంగా తాను అనుకున్నదే చేసింది. పాలను జీఎస్టీ పరిధిలోకి తేవడం వల్ల పేదలపై ఎలాంటి భారం పడదని నమ్మబలికింది. కానీ కేంద్రానిది ఎంతటి వంచనో ఇప్పుడు అనుభవంలో తెలుస్తున్నది.
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలకు రెక్కలొచ్చి ఆకాశానికి ఎగురుతున్నాయి. జీఎస్టీ దెబ్బకు పేదింటి బిడ్డల ఆకలి తీర్చలేనంటున్నాయి. ఇటీవలి ద్రవ్యోల్బణం కారణంగా గడిచిన 20 నెలల కాలంలో వీటి ధరల్లో మరింత పెరుగుదల కనిపిస్తున్నది. మరీ ముఖ్యంగా గత ఐదు నెలల్లో దేశంలో పెరిగిన ఇతర నిత్యావసరాల ధరల స్థాయి కంటే వీటి ధరలు అధికంగా పెరిగాయి. సరఫరా, డిమాండ్ స్థాయిల ఆధారంగా పాలు, పాల ఉత్పత్తుల ధరలు అధికంగా ఉంటున్నాయని పాల పరిశ్రమకు చెందిన నిపుణులు అన్నారు.
2021 జులై నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ ప్రతి నెలలోనూ వినియోగ ధరల సూచీకి సంబంధించి పాలు, పాల ఉత్పత్తుల విభాగంలో ద్రవ్యోల్బణ రేటు గణనీయంగా పెరిగింది. 2022 అక్టోబర్ నుంచి దేశంలో ఇతర ఉత్పత్తుల ధరల పెరుగుదలతో పోలిస్తే పాల ధరలో పెరుగుదల అధికంగా ఉన్నది. గతేడాది ఏప్రిల్ 4న లీటరు పాల ధర రూ. 51.40 ఉండగా ఈ సంవత్సరం అదే తేదీన రూ 56.80 ఉన్నది.
వినియోగ వ్యవహారాల విభాగం అందించిన గణాంకాల ప్రకారం ఈ సంవత్సర కాలంలో ధరలో 10.5 శాతం పెరుగుదల కనిపించింది. ఇప్పటికే కేంద్రం విధించిన జీఎస్టీ కారణంగా పాలు సైతం భగ్గున మండుతుండగా, ఇప్పుడు ఉత్పాదక వ్యయం కూడా పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని జాతీయ డెయిరీ పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త బి.ఎస్. చందల్ తెలిపారు. పశుగ్రాసం, దాణాలో ఉపయోగించే మూలకాల ధరలు బాగా పెరిగాయని ఆయన చెప్పారు. కోవిడ్, దాని తదనంతర కాలంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పాల ఉత్పత్తి పడిపోయిందని వివరించారు. దాణా డిమాండ్లో కేవలం 60 శాతం మాత్రమే మన దేశంలో సరఫరా అవుతున్నదనీ, దీనితో ఉత్పాదక వ్యయం పెరిగి పాల ధర అధికంగా ఉన్నదని అన్నారు.
పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమేనని జాతీయ డెయిరీ సంస్థ అధ్యక్షుడు ఆర్.ఎస్. సోథీ తెలిపారు. లాక్డౌన్ సమయంలో పాలకు డిమాండ్ పడిపోవడంతో డెయిరీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడిందని ఆయన చెప్పారు. డిమాండ్ తగ్గినంత మాత్రాన ఉత్పత్తి పడిపోలేదని, దీనివల్ల ఆ కాలంలో పాలు, పాల ఉత్పత్తుల ధరల్లో కొంత తగ్గుదల కన్పించిందని అన్నారు. దీంతో ఆ తర్వాతి కాలంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు రైతులు ఆసక్తి చూపలేదని చెప్పారు. దేశంలో పాల ఉత్పత్తి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందని, అయితే కోవిడ్ తర్వాత ఉత్పత్తి రేటులో వృద్ధి తగ్గిందని వివరించారు. కోవిడ్ కాలంలో పశువులకు కృత్రిమ గర్భధారణ ప్రక్రియ సజావుగా సాగలేదని, దీనివల్ల ఉత్పత్తి తగ్గిందని ఆయన అన్నారు. మొత్తానికి ఈ కాలంలో పాలు, పాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగాయని ఇరువురు నిపుణులూ తెలిపారు. కొనుగోలు శక్తి పెరగడమే దీనికి కారణమని చందల్ అభిప్రాయపడగా, ఆహారంలో ప్రొటీన్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన పెరగడమే దీనికి కారణమని సోథీ చెప్పారు. పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని సోథీ అనగా ఉత్పాదకాల ధరలు పెరగడమే కారణమని చందల్ అన్నారు. ఇలా కారణాలేమైనా ప్రజలకు అత్యంత నిత్యావసరమైన పాల కోసం అపసోపాలు పడాల్సిన కాలం దాపురించింది. ఈ పాపం మోడీ సర్కారుది కాకుంటే ఇంకెవరిది?