Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక, గ్రామీణ పేదల వ్యతిరేక విధానాలపై ఉద్యమం
- ఏప్రిల్ 20 నుంచి పదివేల గ్రామాల్లో ఆందోళన సభలు :ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయ రాఘవన్, బి.వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ సర్కార్ వ్యవసాయ కార్మిక, గ్రామీణ పేదల వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఏప్రిల్ 20 నుంచి పది వేల గ్రామాల్లో ఆందోళనా సభలు నిర్వహిస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయరాఘవన్, బి. వెంకట్ తెలిపారు. రెండు రోజుల పాటు తెలంగాణ,ఏపీ భవన్లో జరిగిన ఏఐఏడబ్ల్యూయూ వర్కింగ్ కమిటీ సమావేశం గురువారం ముగిసింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం నేతలు విక్రమ్ సింగ్, వి.శివదాసన్ (రాజ్యసభ ఎంపీ)తో కలిసి ఎ.విజయ రాఘవన్, బి. వెంకట్ మాట్లాడారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల పరిస్థితిపై చర్చించామని తెలిపారు. మూడు నెలల్లో 25 వేల గ్రామాల్లో ఆందోళనా సభలు నిర్వహిస్తామని అన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందనీ, అందులోనూ గ్రామీణ నిరుద్యోగం భారీగా పెరిగిందని తెలిపారు. 10 నుంచి 15 కోట్ల మంది గ్రామీణ పేదలకు ఉపాధి లేదని అన్నారు. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల కొనుగోలు శక్తి తగ్గిందని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో సబ్సిడీ ఆహార పదార్థాలను తొలగిస్తోందనీ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తోందని అన్నారు. రెండేండ్లుగా పశ్చిమ బెంగాల్‌తో సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రోజు కూడా ఉపాధి హామీ ద్వారా పని కల్పించలేదని పేర్కొన్నారు. ఉపాధి హామీకి నిధుల కోత విధిస్తున్నారని, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వేల కోట్ల బకాయిలు కేంద్రం విడుదల చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆధార్ లింక్, ఆన్లైన్ హాజరు, ఆన్లైన్ చెల్లింపులు వంటి వ్యవస్థలతో ఉపాధి హామీని హననం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ సర్కార్ హయాంలో లక్ష మంది వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. దేశంలో ఆరు లక్షల హెక్టార్ల భూమి ఉన్నదనీ, దాన్ని భూమి లేని వారికి పంపిణీ చేయాలన్నారు. కానీ మోడీ సర్కార్ కార్పొరేట్లకు భూములను ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. బీజేపీ బడా వ్యాపారులు, ధనికులతో కలిసి ఎన్నికలకు వెళ్తుందని, కింది స్థాయి వారు బీజేపీకి అవసరం లేదని దుయ్య బట్టారు. ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల మద్దతుతో దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు.