Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూసివేసిన షుగర్ మిల్లులను తెరవాలి
- బకాయిలన్నీ వెంటనే చెల్లించాలి
- ప్రభుత్వ, సహకార షుగర్ మిల్లుల ప్రయివేటీకరణ ఆపాలి
- జంతర్ మంతర్ వద్ద ఏఐఎస్సీఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన
- రంగరాజన్ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకం : విజ్జూకృష్ణన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
చెరుకుకు టన్నుకు రూ.5 వేలు (క్వింటాల్‌కు రూ.500) ధర చెల్లించాలని అఖిల భారత చెరుకు రైతుల సమాఖ్య (ఏఐఎస్సీఎఫ్ఎఫ్) డిమాండ్ చేసింది. గురువారం నాడిక్కడ జంతర్ మంతర్‌లో ఆరు డిమాండ్ల సాధన కోసం ఏఐఎస్సీఎఫ్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో చెరుకు పండించే పది రాష్ట్రాల నుంచి రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్సీఎఫ్ఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. రవీంద్రన్, ఎన్‌కె శుక్లా మాట్లా డుతూ చెరుకుకు 9.5 శాతం రికవరీతో టన్నుకు రూ.5 వేలు చెల్లించాలనీ, సహకార, ప్రభుత్వ రంగ షుగర్ మిల్లుల ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే మూసివేసిన సహకార, ప్రభుత్వ రంగ చక్కెర కర్మాగారాలను తెరవడానికి, వాటి నిర్వహణకు నేషనల్ కో ఆపరేటివ్ డెవల ప్మెంట్ కార్పొరేషన్ నుంచి వడ్డీ లేని రుణాలివ్వాలని కోరారు. 40 ఏండ్ల క్రితం ఏర్పాటు చేసిన సహకార, ప్రభు త్వ రంగ మిల్లులను పునరుద్ధరించి ఆధునీకరించాలన్నారు. దీని కోసం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల చేయాలని కోరారు. 2025 నాటికి ఇథనాల్ ఉత్పత్తిని పెంచే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందనీ, దేశవ్యాప్తంగా ఉన్న సహకార చక్కెర కర్మా గారాల్లో ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 1966 షుగర్ కంట్రోల్ ఆదేశాల ఆధా రంగా సర ఫరా చేసిన చెరుకుకు 14 రోజుల్లోగా సొమ్మును చెల్లించి, బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
రంగరాజన్ కమిటీ రిపోర్టుకు వ్యతిరేకం : విజ్జూ కృష్ణన్
రంగరాజన్ కమిటీ రిపోర్టును తాము వ్యతిరేకిస్తు న్నామని, ఆ రిపోర్టు కేవలం కార్పొరేట్లకే లాభాలు చేకూర్చే విధంగా ఉన్నదని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ అన్నారు. చెరుకు రైతులకు రూ.23 వేల కోట్ల బకాయిలు న్నాయనీ, వాటిని రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదని తెలిపారు. చెరుకు రైతుల సమస్యలు చెప్పుకుందామని కేంద్ర వ్యవ సాయ శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరితే, బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం ఉన్నదనీ, తాను అపాయింట్ మెంట్ ఇవ్వలేనని కేంద్ర మంత్రి అనడం దారుణమన్నారు. కేంద్ర మంత్రులు రైతుల హితం కోరుకోవడం లేదనీ, కార్పొ రేట్ల లాభాలే లక్ష్యంగా పని చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ, ఏపీలో టయోటా వంటి బహుళ జాతి కంపెనీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందని, ఇతర దేశాల్లోంచి షుగర్‌ను దిగుమతి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అందుకే షుగర్‌పై దిగుమతి సుంకం తగ్గిస్తున్నారని అన్నారు. అంతేకాక దేశంలోని షుగర్ మిల్లులను మూసివేసి, రైతులకు నష్టం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బల్వాన్ సింగ్ (హర్యానా), ప్రభురాజ్ ఎన్.రావు (బీహార్), ఎల్.మారన్ (తమిళనాడు), మారారిల్లా ఠాకూర్ (మధ్యప్రదేశ్), ఉమేశ్ దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), పుష్పేంద్ర త్యాగి (ఉత్తరప్రదేశ్), ఏఐకేఎస్ నేతలు హన్నన్ మొల్లా, కృష్ణ ప్రసాద్, బాదల్ సరోజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో ఆరు షుగర్ ఫ్యాక్టరీలు మూత : బి.రాంబాబు
తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఆరు షుగర్ ఫ్యాక్టరీలు మూతబడ్డాయని, ప్రస్తుతం ఐదు మాత్రమే పని చేస్తున్నాయని చెరుకు రైతుల సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రాంబాబు తెలిపారు. తెలంగాణలో 1.25 లక్షల ఎకరాల్లో చెరుకు పంట సాగు జరిగేదనీ, ఇప్పుడు కేవలం 45 వేల ఎకరాలకు పంట సాగు పడిపోయిందని పేర్కొన్నారు. ఈ షుగర్ ఫ్యాక్టరీల పరిధిలో సాగు విస్తీర్ణం కూడా రోజు రోజుకు తగ్గిపోతుందని అన్నారు. గతంలో 8.5 రికవరీ బేస్ మీద మద్దతు ధర నిర్ణయించే వారని, తెలంగాణలో 9 నుంచి 10.5 వరకు రికవరీ బేస్ వచ్చేదనీ, ఫలితంగా మద్దతు ధర కంటే అదనంగా టన్నుకు రూ.200 నుంచి రూ.300 వచ్చేందని తెలిపారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం 9.5, 10.5కు రికవరీ బేస్ పెంచిందనీ, దానివల్ల రైతులకు గిట్టుబాటు ధర కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు కుదించడం వల్ల రైతులపై అదనపు భారం పడుతోందని అన్నారు. చెరుకు రైతులకు క్రాప్ ఇన్సూరెన్సు లేదనీ, పెద్ద ఎత్తున నష్టపోతున్నారని పేర్కొన్నారు. చెరుకు కోత, రవాణా చార్జీలు విపరీతంగా పెరిగాయని అన్నారు. చెరుకు కోతకు టన్నుకు రూ.800 నుంచి రూ.1200 వరకు అవుతుందని, దూరాన్ని బట్టీ రవాణా ఛార్జీలు టన్నుకు రూ.300 నుంచి రూ.400 అవుతున్నాయని తెలిపారు. ఫ్యాక్టరీలు టన్నుకు రూ.3 వేల నుంచి రూ.3,100 వరకు ఇస్తున్నాయని, అందులో సగం కోత, రవాణా ఛార్జీలకే అవుతుందని పేర్కొన్నారు. కనుక కోత, రవాణా ఛార్జీలు కూడా ఫ్యాక్టరీలే భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెరకు రైతుల సంఘం రాష్ట్ర నేతలు జి. ఉమ, మాదినేని రమేష్ బాబు, రాయల వెంకటేశ్వరావు, తన్నేరు కృష్ణార్జున్ తదితరులు పాల్గొన్నారు.