Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెపో రేటు 6.5 శాతంగా కొనసాగింపు
- జీడీపీ కూడా అంతే..
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు
- ఆర్బీఐ గవర్నర్ వెల్లడి
ముంబయి : వరుసగా ఆరు సార్లు కీలక వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా సమీక్షాలో ఉపశమనం కల్పించింది. మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షా గురువారం నాటితో ముగిసింది. ఈ దఫా కూడా కీలక వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చన్న నిపుణుల అంచనాలకు భిన్నంగా.. రెపోరేటును యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. 2023-24లో ఇదే తొలి ద్రవ్య పరపతి విధాన సమీక్ష. భేటీ అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడుతూ.. 2022-23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏడు శాతం పెరగొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నాయన్నారు. అయితే ద్రవ్యోల్బణంపై మాత్రం యుద్ధం కొనసాగుతుందని గవర్నర్ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ప్రస్తుత ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం పెరగొచ్చన్నారు. ఇంతక్రితం ఆరు సమీక్షల్లోనూ రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రుణ గ్రహీతలపై తీవ్ర భారం పడింది.కొత్త ఏడాది 2023 ఆశాజనకంగా ప్రారంభమైందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలు మెరుగయ్యాయని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని వెల్లడించారు. అనుహ్యంగా మార్చిలో అంతర్జాతీయ పరిస్థితులు క్లిష్టంగా మారాయన్నారు. బ్యాంకింగ్ రంగంలో పలు కుదుపులు చోటు చేసుకున్నాయన్నారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థల స్థిరత్వంపై అనుమానాలు నెలకొన్నాయన్నారు. వాటి పర్యవసానాలపై ఆర్బీఐ దృష్టి సారించిందన్నారు. కాగా.. దేశ బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయన్నారు. ఇటీవల అమెరికన్, స్విస్ బ్యాంక్‌ల్లో తీవ్ర సంక్షోభం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ద్రవ్యోల్బణం కొంత అదుపులోకి వచ్చినప్పటికీ.. తాము ఎంచుకున్న లక్ష్యం కంటే ఎక్కువగానే ఉందన్నారు. 2023-24 జీడీపీ అంచనాలను 6.4 శాతం నుంచి 6.5 శాతానికి పెంచామన్నారు.