Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడ దేవాలయాలు కట్టండి
- ఏడాది జీతం విరాళంగా ఇస్తా : అసోం బీజేపీ ఎమ్మెల్యే కుర్మి
గువహతి : దేశంలోని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ చరిత్రను తుడిచేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. తన మతోన్మాద అజెండాను మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోయేందుకు కృతనిశ్చయంతో కనిపిస్తున్నది. తాజాగా ఆ పార్టీకి చెందిన అసోం శాసనసభ్యుడు చారిత్రక కట్టడాలను కూల్చేయాలంటూ పిలుపునిచ్చారు. వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు.చారిత్రక తాజ్‌మహల్, కుతుబ్‌మినార్ కట్టడాలను కూల్చేసి వాటి స్థానంలో దేవాలయాలు నిర్మించాలని అసోంలోని మరియానీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మి సూచించారు. విలేకరుల సమావేశంలో కుర్మి చెప్పిన మాటల వీడియో సోషల్ మీడియాలో వైరలైతోంది. తాజ్‌మహల్, కుతుబ్‌మినార్లను కూల్చేసి అక్కడ దేవాలయాలను నిర్మించాలంటూ ఆయన ప్రధాని మోడీని కోరారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి తన సంవత్సర జీతం విరాళంగా ఇస్తానని కూడా ఆయన ఆఫర్ ఇచ్చారు. తన ప్రకటనపై వివాదం చెలరేగినప్పటికీ ఆయన వెనక్కు తగ్గలేదు. తాజ్‌మహల్‌ను ప్రేమకు చిహ్నంగా చూడరాదంటూ వితండవాదం చేశారు. ''మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన నాలుగో భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను నిర్మించారు. ఆయన నిజంగా ముంతాజ్‌ను ప్రేమిస్తుంటే ఆమె మరణం తర్వాత మరో ముగ్గురిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు ?'' అని ప్రశ్నించారు. అసోం రాజధాని గువహతిలోని లటాసీ పోలీస్ స్టేషన్లో కుర్మిపై ఫిర్యాదు నమోదైంది. అయితే ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకంలో మొఘల్ చరిత్రకు సంబంధించిన చాప్టర్‌ను తొలగించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బీజేపీ నాయకులు వెనక్కి తగ్గడం లేదు. కుర్మీ వ్యాఖ్యలు అందులో భాగమే అని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు అన్నారు.