Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దుష్ప్రచారం కొనసాగవచ్చు
- చరిత్రను తుడిచేయడమే వారి లక్ష్యం
- తుషార్ మండిపాటు
న్యూఢిల్లీ : మహత్మాగాంధీ పేరంటేనే బీజేపీ-ఆర్ఎస్ఎస్కు కంటగింపుగా ఉందని ఆయన ముని మనుమడు తుషార్ గాంధీ వ్యాఖ్యానించారు. గాంధీజీ పేరు ప్రతిష్టలు, గుర్తింపు వారికి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో గాంధీజీ పాఠ్యాంశం మాయం కావడం ఆశ్చర్యం కలిగించడం లేదని, అయితే అలాంటి మరిన్ని ప్రయత్నాలు జరుగుతాయేమోనన్నదే ఆందోళన కలిగించే విషయమని అన్నారు. సంసంఘ్ పరివార్ దుష్ప్రచారంలో గాంధీజీ పాఠ్యాంశాల తొలగింపు ఒక భాగమని తెలిపారు. 'చరిత్రను తుడిచేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. చరిత్రను తిరగరాయడం, దానిని అగౌరవపరచడం వంటి సంఫ్‌ుపరివార్ ఉద్దేశాలలో రహస్యమేమీ లేదు. ఇది రెండు లక్ష్యాలను నెరవేరుస్తుంది. తమకు అనుకూలమైన చరిత్రను రాయడం, తాము గాంధీజీని ఎలా చూపాలనుకున్నారో అలా చిత్రించడం. ఎందుకంటే ఆయన పేరుప్రతిష్టలు వారికి ఎప్పుడూ కంటగింపుగానే ఉంటాయి' అని తుషార్ అన్నారు. చరిత్ర పుటలను వక్రీకరించడమే వారి పని అని విమర్శించారు. భవిష్యత్ తరాల వారికి చరిత్ర తెలియకుండా చేయడమే సంఫ్‌ు పరివార్ లక్ష్యమని, తమ దుష్ప్రచారాన్ని వారు నమ్మేలా చేసేందుకు యత్నిస్తోందని చెప్పారు. మొదట్లోనే యువత మేధస్సును కలుషితం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంలో ఇది ఒక భాగమని అన్నారు. యువత మస్తిష్కంలో అబద్ధాలను చొప్పించి, తమ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవాలని సంఫ్‌ుపరివార్ భావిస్తోందని తుషార్ గాంధీ విమర్శించారు. ఆర్ఎస్ఎస్ నిండా కపటత్వమే దాగి ఉందని, దాని పని మభ్యపెట్టడమేనని అన్నారు.