Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమావేశాలు జరిగిన తీరు లోక్సభలో 34శాతం,రాజ్యసభ 24శాతం
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. అధికార, ప్రతిపక్షాల ఆందోళనలతో అధిక భాగం వాయిదాల పర్వమే కొనసాగింది. దీంతో ఉభయ సభలు షెడ్యూల్ కంటే చాలా తక్కువ సమయమే పనిచేశాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టగా, ఆరు బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. ఈ సమావేశాల్లో లోక్సభ 34 శాతం, రాజ్యసభ 24 శాతం జరిగింది. జనవరి 31న ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ముగిశాయి. మొదటి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 12 వరకు, రెండో విడత మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగాయి. మొదటి విడతలో పది రోజులు, రెండో విడతలో 15 రోజులు కార్యాకలాపాలు జరిగాయి. మొత్తం 25 రోజుల పాటు సమావేశాలు జరిగాయని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి విడతలో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో 13.44 గంటలు, రాజ్యసభలో 12.42 గంటలు పాటు చర్చ జరిగింది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లపై ఉభయ సభల్లో సాధారణ చర్చ జరిగింది. లోక్సభలో 14.45 గంటలు, రాజ్యసభలో కేవలం 2.21 గంటల పాటు మాత్రమే చర్చ జరిగింది. లోక్సభలో నిరంతర అంతరాయాల కారణంగా రైల్వేలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గిరిజన వ్యవహారాలు, పర్యాటకం, సంస్కృతి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం వంటి మంత్రిత్వ శాఖల గ్రాంట్ల కోసం డిమాండ్లపై చర్చ జరగలేదు. రాజ్యసభలో స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, టెక్స్టైల్స్, ఫిషరీస్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, గ్రామీణాభివృద్ధి, సహకారం, రైల్వేలు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖల పనితీరుపై సభలో నిరంతర అంతరాయాల కారణంగా చర్చ జరగలేదు.
తీవ్ర అంతరాయం
రెండో విడత సమావేశాల్లో లోక్సభ 45 గంటలు, రాజ్యసభ 31 గంటల పాటు పనిచేసిందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసర్చ్ సర్వే డేటా వెల్లడించింది. అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారం ఉభయ సభలను కుదిపేసింది. ఈ ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి. దీంతో సభలు తరచూ స్తంభించాయి. లోక్సభ మొత్తం 133.6 గంటలు పనిచేయాల్సి ఉండగా కేవలం 45 గంటలు (34.28శాతం) పనిచేసింది. ఇక రాజ్యసభను 130 గంటలు నిర్వహించాల్సి ఉండగా.. 31 గంటల (24 శాతం) పాటు మాత్రమే పనిచేసిందని సర్వే డేటా స్పష్టం చేసింది.