Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్ కంటెంట్ కట్టడికి కేంద్రం చర్యలు
- నకిలీ వార్తలు గుర్తించే పేరుతో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయం
- ఐటీ నిబంధనల్లో ఇప్పటికే సవరణలు నోటిఫై
- ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన
కేంద్రంలోని మోడీ పాలనలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోయింది. ప్రభుత్వానికి సంబంధిచిన విషయాలు, ఇతర వాస్తవాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చే మీడియాను మోడీ ప్రభుత్వం నయానో, భయానో బెదిరించి కట్టడి చేస్తున్నది. భారత్‌లోని జర్నలిస్టులకు భద్రత లేదనీ, పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయిందని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు సైతం స్పష్టం చేసిన విధానమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు మోడీ సర్కారు కన్ను ఆన్లైన్లో వచ్చే వార్తలు, సోషల్ మీడియా పైనా పడింది. విమర్శలను సహించని కేంద్రం.. ప్రభుత్వంపై వచ్చే 'ఫేక్ న్యూస్' గుర్తింపు పేరుతో ఆన్లైన్ కంటెంట్‌ను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా 'ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్'ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
న్యూఢిల్లీ : దేశంలోని సామాన్య పౌరుడు సైతం తన భావాలను పంచుకోగలిగే సోషల్ మీడియానూ, ఆన్లైన్ కంటెంట్‌ను నియంత్రించడానికి మోడీ సర్కారు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వం గురించి వచ్చే ఫేక్ వార్తల కట్టడి పేరుతో ఆంక్షలకు దిగుతున్నది. ఆన్లైన్లో పోస్ట్ అయిన తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు '' ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్''ను ఏర్పాటు చేయాలని నిర్ణరయించింది. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికలు, ఇతర మధ్యవర్తులు.. అప్లోడ్ చేయబడిన కంటెంట్ ''ఫేక్ లేదా తప్పుదారి పట్టించేదిగా ఉన్నది'' అని ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ గుర్తిస్తే సదరు సమాచారాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. సమాచార సాంకేతిక (ఐటీ) నిబంధనలు, 2021లో జరిగిన సవరణలను గురువారమే నోటిఫై చేసింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) లేదా నిజ నిర్ధారణ కోసం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఇతర ఏ ఏజెన్సీ ద్వారానైనా ''ఫేక్ న్యూస్'' అని గుర్తించబడితే సదరు పోస్టును తొలగించాల్సి ఉంటుందని జనవరిలో సదరు మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ రూల్స్‌లో ప్రచురించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై పౌర హక్కుల కార్యకర్తలు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ఇతర న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్, డిజిటల్ అసోసియేషన్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇందులో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు సంబంధించిన రిఫరెన్సును సవరణతో తొలగించింది.
గతంలో కేంద్ర సమాచార
విభాగంపై విమర్శల వెల్లువ
అనేక వార్తల విషయంలో ''ఫేక్ ముద్ర'' వేయడం ద్వారా నకిలీ వార్తలను గుర్తించే విషయంలో కేంద్ర సమాచార విభాగం అనేక సందర్భాల్లో విమర్శలను ఎదుర్కొన్నది. ఆ తర్వాత అధికారులే స్వయంగా ధృవీకరించారు. అలాగే, కేంద్రాన్ని విమర్శిస్తూ వచ్చే వార్తలను తిరస్కరిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా విమర్శలను ఎదుర్కొన్నది. అయితే, సదరు వార్తలు అవాస్తవాలు అన్నదానిపై ఎలాంటి నిజ నిర్ధారణ లేకుండానే ఈ విధమైన చర్యలకు దిగడంతో ప్రతిష్టను దిగజార్చుకున్నది. ఇలాంటి తరుణంలో ఏర్పాటయ్యే ఫ్యాక్ట్ చెకింగ్ టీం స్వతంత్రంగా పని చేస్తుందనడానికి నమ్మకం ఏమిటని సామాజిక కార్యకర్తలు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో స్వతంత్రంగా పని చేసే వ్యక్తులు, సంస్థల గొంతు నొక్కే చర్యగా వారు అభివర్ణించారు.అయితే రాబోయే ప్రభుత్వ సంస్థ కంటెంట్ నిజ నిర్ధారణ విషయంలో విశ్వసనీయ పద్దతిలో పని చేస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఇందులోని నిబంధనలు ఆర్టికల్ 19కింద ఉన్న హక్కుల్లోకి చొరబడవనీ, ఈ విషయంలో మీడియా, జర్నలిస్టులు ఆందోళన చెందకూడదని అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోనే నిజ నిర్ధారణ యూనిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు.
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం
- సవరణలు సెన్సార్‌షిప్‌తో సమానం
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా
కేంద్రం చర్యపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఇది తీవ్ర ఆందోళనకు గురి చేసిందని వివరించింది. నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖను ప్రకటనలో అభ్యర్థించింది. ఈ సవరణలు దేశంలో పత్రికా స్వేచ్ఛకు లోతైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదంతా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, సెన్సార్‌షిప్‌కు సమానమని వివరించింది. మీడియా సంస్థలు, పత్రికా సంస్థలను సంప్రదించకుండానే ఐటీ మంత్రిత్వ శాఖ ఈ సవరణలను నోటిఫై చేయడం ఆశ్చర్యంగా ఉన్నదని పేర్కొన్నది. డిజిటల్ హక్కుల సంఘం ''ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్'' కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వంలోని ఏదైనా యూనిట్‌కు అలాంటి ''ఏకపక్ష, విస్తృత అధికారాలు'' కేటాయించడం సహజ న్యాయ సూత్రాలను దాటవేస్తుందని పేర్కొన్నది.
ముమ్మాటికి ప్రత్యక్షదాడే
ఐటీ చట్టంలో సవరణలపై బీజేపీ ప్రభుత్వ చర్యను సీపీఐ(ఎం) జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఐటీ నిబంధనలలోని సవరణలు 'భావప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్షదాడి'గా ఆయన ఆరోపించారు. పీఐబీ ద్వారా నకిలీ వార్తలుగా భావించే పోస్టులను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కోరడం ప్రమాదకరమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సవరణలను వెనక్కి తీసుకోవాలని వివరించారు. ప్రజాస్వామ్యంలో సెన్సార్‌షిప్‌నకు చోటు లేదని పేర్కొన్నారు.
-సీతారాం ఏచూరి