Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటివరకూ లోక్‌సభ పని చేసింది 230 రోజులే
- చర్చ లేకుండానే కీలక బిల్లులు ఆమోదం
- సభ్యుల చొరవ అంతంత మాత్రమే
- ఉప సభాపతి ఎన్నిక కూడా జరగలేదు
న్యూఢిల్లీ : ప్రస్తుత లోక్‌సభ సమావేశాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే 17వ లోక్‌సభ ఇప్పటి వరకూ కేవలం 230 రోజులు మాత్రమే సమావేశమైంది. ఇప్పటి వరకూ పూర్తికాలం పనిచేసిన లోక్‌సభల్లో 16వ లోక్‌సభ అతి తక్కువగా 331 రోజులు సమావేశమైంది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగియడానికి కేవలం సంవత్సరం మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అంతకంటే ఎక్కువ రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశాలు కన్పించడం లేదు. ఎందుకంటే ప్రస్తుత లోక్‌సభ సగటున సంవత్సరంలో 58 రోజులు మాత్రమే కార్యకలాపాలు సాగించింది. ఇదే కొనసాగితే 1952 తర్వాత ఇంత తక్కువ రోజులు సమావేశమయ్యే లోక్‌సభ ఇదే అవుతుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ నిర్ణీత కాలంలో కేవలం 33 శాతం (46 గంటలు), రాజ్యసభ 24 శాతం (32 గంటలు) మాత్రమే సమావేశమయ్యాయి. పక్షం రోజుల పాటు జరిగిన రెండో అర్థభాగంలో నిర్ణీత కాలంలో లోక్‌సభ ఐదు శాతం, రాజ్యసభ ఆరు శాతం మాత్రమే సమావేశమయ్యాయి. ఇందులోనూ సభల ముందు పత్రాలు ఉంచడంలోనే ఎక్కువ సమయం గడచిపోయింది.
బడ్జెట్ సమావేశాలలో ద్రవ్య వినిమయ బిల్లులు కాకుండా ఒకే ఒక్క బిల్లు...కాంపిటీషన్ (సవరణ బిల్లు)-2022 మాత్రమే ఆమోదం పొందింది. ఇది కూడా ఆర్థిక బిల్లు మాదిరిగానే ఎలాంటి చర్చ లేకుండానే సభ ఆమోదం పొందింది. బడ్జెట్ సమావేశాలలో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిలో అటవీ (సంరక్షణ) సవరణ బిల్లు-2023ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. 17వ లోక్‌సభలో ఇప్పటివరకూ 150 బిల్లులను ప్రవేశపెట్టగా వాటిలో 131 బిల్లులు (ద్రవ్య వినిమయ బిల్లులు మినహా) ఆమోదం పొందాయి. మొదటి సమావేశాలలో 38 బిల్లులు ప్రవేశపెట్టగా 28 బిల్లులను ఆమోదించారు. అప్పటినుంచీ ప్రవేశపెట్టిన, ఆమోదం పొందిన బిల్లుల సంఖ్య తగ్గిపోయింది. గత నాలుగు సమావేశాలలోనూ ఒక్కో దానిలో పది కంటే తక్కువగా బిల్లులను ప్రవేశపెట్టడమో లేదా ఆమోదించడమో జరిగింది.
1952 తర్వాత బడ్జెట్ సమావేశాలు తక్కువ సమయంలో ముగియడం ఇది ఆరోసారి. ప్రస్తుత లోక్‌సభ ఆర్థిక వ్యవహారాలపై 18 గంటలు చర్చించింది. ఇందులో 16 గంటల పాటు సాధారణ బడ్జెట్ పైనే చర్చ సాగింది. ప్రస్తుత లోక్‌సభ బడ్జెట్ సమావేశాలలో సగటున 55 గంటల పాటు ఆర్థిక వ్యవహారాలపై సభ్యులు చర్చించారు. అయిదు మంత్రిత్వ శాఖలకు చెందిన రూ.11 లక్షల కోట్ల ఖర్చుకు సంబంధించిన పద్దులు లోక్‌సభ ముందుకు వచ్చినప్పటికీ ఏ ఒక్క దానిపైనా చర్చ జరగలేదు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ప్రతిపాదిత రూ. 42 లక్షల కోట్ల వ్యయం పైన ఎలాంటి చర్చ జరగకుండానే ఆమోదం లభించింది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే గడచిన ఏడు సంవత్సరాల కాలంలో సగటున 79 శాతం బడ్జెట్‌ను చర్చ జరపకుండానే ఆమోదించారు.
రాజ్యసభలో కొన్ని ఎంపిక చేసిన మంత్రిత్వ శాఖల పనితీరుపై చర్చించారు. బడ్జెట్ సమావేశాలలో రైల్వేలు, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, సహకారం, సాంస్కృతిక శాఖలు సహా ఏడు మంత్రిత్వ శాఖలపై ఎలాంటి చర్చ జరగలేదు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే తీర్మానంపై మాత్రమే ఉభయసభల్లో చర్చించారు. దీనిపై రెండు సభలలోనూ 28 గంటల పాటు చర్చ సాగింది. 150 మంది సభ్యులు చర్చలో పాలుపంచుకున్నారు. సభా నిబంధనల ప్రకారం సభ్యులు ప్రజా ప్రాధాన్యత ఉన్న అంశాలపైన చర్చించవచ్చు. ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అరగంట చర్చలు, స్వల్పకాలిక చర్చలు, వాయిదా తీర్మానాల ద్వారా సభ్యులు తమ హక్కులను ఉపయోగించుకోవచ్చు. అయితే 17వ లోక్‌సభ సమావేశాలలో ఇప్పటివరకూ 11 స్వల్పకాలిక చర్చలు, అరగంట వ్యవధి ఉండే చర్చ ఒకటి మాత్రమే జరిగాయి. బడ్జెట్ సమావేశాలలో అలాంటి చర్చ ఒక్కటీ జరగలేదు. రాజ్యసభలో 267వ నిబంధన కింద ప్రాధాన్యత కలిగిన అంశంపై చర్చించేందుకు ఛైర్పర్సన్ అనుమతితో ఇతర కార్యకలాపాలను సస్పెండ్ చేయవచ్చు. ప్రస్తుత సమావేశాలలో ఈ నిబంధన కింద సభ్యులు 150 నోటీసులకు పైగా ఇచ్చినప్పటికీ అవన్నీ తిరస్కరణకు గురయ్యాయి.
ప్రస్తుత లోక్‌సభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయానికి కేటాయించిన సమయం చాలా తక్కువ. నిర్ణీత సమయంలో లోక్‌సభలో 19 శాతం, రాజ్యసభలో 9 శాతం మాత్రమే ప్రశ్నోత్తరాలు సాగాయి. రెండు సభలలోనూ కేవలం ఏడు శాతం చొప్పున ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు లభించాయి. ఈ సమావేశాలలో ప్రయివేటు సభ్యుల బిల్లులేవీ సభ ముందుకు రాలేదు. రెండు సభల్లోనూ ఒక్కో ప్రయివేటు సభ్యుని తీర్మానాలపై మాత్రం చర్చించాయి. లోక్‌సభలో రైల్వేల సుందరీకరణ, ఆధునీకరణపై చర్చ జరగగా రాజ్యసభలో సచార్ కమిటీ నివేదికపై చర్చించారు.
17వ లోక్‌సభ సమావేశలు చివరి దశకు చేరుకున్నప్పటికీ సభకు ఇప్పటి వరకూ ఉప సభాపతి లేకపోవడం గమనార్హం. ఉప సభాపతి పదవికి ఎన్నిక నిర్వహించడంలో జరుగుతున్న జాప్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు, ఫిబ్రవరిలో కేంద్రానికి నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ ఎన్నిక జరగలేదు. గతంలో ఇలాంటి సందర్భం ఒక్కటి మాత్రమే వచ్చింది. 12వ లోక్‌సభ కాలంలో సభ 269 రోజులు జరగగా ఉప సభాపతిని ఎన్నికోవడానికి మూడు నెలల సమయం తీసుకున్నారు. పార్లమెంట్ జరిగిన తీరు సునిశితంగా గమనిస్తే..ప్రతిపక్షాలు వల్లే సభను నడిపించలేకపోతున్నామనే సీన్ క్రియేటే చేసి..మరోవైపు ప్రభుత్వానికి అవసరమైన బిల్లుల్ని మూజువాణి ఓటింగ్ ద్వారా ఆమోదించుకోవటం గమనార్హం.