Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బనారస్ వర్శిటీలో నిరసనలు
వారణాసి: దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, సిలబస్‌లో మార్పులకు వ్యతిరేకంగా గురువారం బనారస్ యూనివర్శిటీ (బిహెచ్‌యు) విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.బీహార్‌లో చారిత్రిక మదర్సా దహనం, ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యాంశాల్లో మార్పులను వారు ఖండించారు. విశ్వ విద్యాలయంలోని లంక గేట్‌వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమికూడి 'సద్భావన వర్థిల్లాలి', 'హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ ఐక్యత వర్థిల్లాలి', 'హిందూ, ముస్లిం భాయి భాయి', 'లౌకికవాదం వర్థిల్లాలి' అంటూ బిగ్గరగా నినదించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బనారస్ వర్శిటీ విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు,పౌర సమాజం ఎప్పటికప్పుడు గళమెత్తుతారు. గతంలో వివక్షాపూరిత పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా రుద్దేందుకు ప్రయత్నించినప్పుడు దానికి వ్యతిరేకంగా బనారస్ వర్శిటీ ముందుండి పోరాడింది. కొందరు జైలుకు కూడా వెళ్లారు. తాజాగా ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల్లో ప్రతిపాదిత మార్పులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. నిరసనలో పాల్గొన్న యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ధనుంజరు సగ్గు న్యూస్‌క్లిక్‌తో మాట్లాడుతూ, బీహార్‌లో ఒక పురాతన మదర్సాను తగులబెట్టడం ద్వారా దేశంలో మత సామరస్యానికి, పరస్పర సోదర భావానికి విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని అన్నారు. ఇటువంటి ఘటనలు నాగరిక, ప్రజాస్వామ్య సమాజానికే మాయని మచ్చ, మానవాళికే అవమానం అని పేర్కొన్నారు. దేశంలో తీవ్ర రూపం దాల్చిన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైన మోడీ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు మతతత్వ ఎజెండాను ముందుకు తెస్తోందని, దీనిని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన అన్నారు. బిహెచ్‌యు విద్యార్థి అపరాజిత వట్లాడుతూ, వారంతా చదివి పెరిగిన ఈ సిలబస్ ఈ రోజు ఎందుకు పనికిరాకుండా పోయిందో తెలపాలని అన్నారు. దీని ద్వారా వారు ఏ ఎజెండాను ప్రచారం చేస్తున్నారో జనానికి తెలుసు. వర్తమానాన్ని, భవిష్యత్తును మార్చగలం, చరిత్రను మార్చలేం. ఈ విషయం వారికి ఎందుకు తలకెక్కడం లేదు? అని సూటిగా ప్రశ్నించారు. మధ్యయుగ భారత దేశ చరిత్ర నుండి మొఘలుల కాలాన్ని అదృశ్యం చేస్తే 1857 తిరుగుబాటులో బహదూర్ షా జాఫర్ గురించి ఎలా తెలుస్తుందని ఆమె అడిగారు. ఆ యుగం గురించి మీరు తెలపకపోతే కబీర్ దాస్, సూర దాస్, తులసీదాస్, రవిదాస్ వంటి గొప్ప వ్యక్తుల గురించి మీకు ఎలా తెలుస్తుంది? నిరాల, సుమిత్రానందన్ పంత్, ఫిరాక్ గోరఖ్‌పురి గ్రంథాలను తొలగిస్తే హిందీలో పెద్ద శూన్యత ఏర్పడుతుంది. ఇటువంటి చర్యలు విద్య, సాహిత్యాలకు వ్యతిరేకం మాత్రమే కాదు, విజ్ఞానానికి, దేశ సమైక్యత, సమగ్రతలకు కూడా వ్యతిరేకమని అన్నారు.
బిహెచ్యులో రిసెర్చి స్కాలర్ రోష్ని మాట్లాడుతూ, 'పుస్తకాల్ని మనం కాల్చివేస్తే, చివరికి అవి మనల్ని కాల్చివేస్తాయి' అన్న హెన్రిచ్ హీన్ రాసిన సుప్రసిద్ధ కొటేషన్్ను ఉటంకించారు. 1933 మే 10న జర్మనీలో తర్కశాస్త్రం, విజ్ఞానం, నాలెడ్జికి సంబంధించిన పుస్తకాలను తగులబెడుతూ నాజీ హిట్లర్ మూకలు గంతులేశాయి. ఈ ఘటన తరువాత ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త రాబర్ట్ ఐన్ స్టీన్ జర్మనీని వీడి వెళ్లిపోయారు. బీహార్‌లో మదర్సాలను, లైబ్రరీలను మతోన్మాదులు తగులబెట్టినప్పుడు జర్మనీలోని ఆ భయంకర రాత్రిని మనం గుర్తుకుతెచ్చుకోవాలి అని ఆయన అన్నారు. మరో నిరసనకారుడు ధనుంజరు త్రిపాఠి మాట్లాడుతూ, నేడు దేశాన్ని మితవాద భావజాలం కమ్మేస్తున్నది. ఇతర మతాల వారిని, వారి ఆలోచనలను, అవగాహనను చంపేస్తున్నారు. సంఫ్‌ుపరివార్ మూకలు ఇసుకలో తలదూర్చిన ఉష్ట్ర పక్షి బాపతులా వ్యవహరిస్తూ, చరిత్రలో నాగరికతను, ప్రగతిశీలతను చెరిపేయాలని చూస్తున్నాయి. సిలబస్‌లోని పాఠాలను మతపరంగా, అహేతుకమైన రీతిలో తొలగించేస్తున్నారు. శాస్త్రీయతకు, ప్రగతిశీలతకు సంఫ్‌ుపరివార్ వ్యతిరేకం, అయితే, భారతదేశ ఆలోచన విభిన్నజాతులు, మతాలు, సంస్కృతుల సహజీవనం, పురోగతిని కోరేదిగా ఉంది.