Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చదువు గురించి కాదు
- నకిలీ డిగ్రీ మాటేంటీ..?
- గుజరాత్ హైకోర్టు తీర్పుతో దేశప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు.. సందేహాలు
న్యూఢిల్లీ : భారతదేశంలో ఒక ఎంపీనో, ఎమ్మెల్యేనో కావడానికి ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. అంతమాత్రాన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఎన్నికల అఫిడవిట్లో నకిలీ పట్టాలను సమర్పిస్తే అది తప్పు కాకుండా పోతుందా? ప్రధాని మోడీ డిగ్రీకి సంబంధించి గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇలాంటి సందేహాలను మరింత పెంచుతున్నదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు, సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లేదా ప్రొవిజన్ లేదా ప్రజాప్రాతినిధ్య చట్టంలోని ఏ సెక్షన్ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికలకు ఎలాంటి విద్యార్హత షరతుల గురించి మాట్లాడలేదు. అంటే భారతదేశంలో ఎంపీ, ఎమ్మెల్యే కావడానికి ఎలాంటి డిగ్రీ అవసరముండదు. కానీ నకిలీ పట్టా సమర్పించడమంటే తప్పుడు సమాచారమందించి ఓటర్లను తప్పుదోవ పట్టించే పనిని అభ్యర్థి చేశాడని అర్థం. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 191 ప్రకారం ఇది శిక్షార్హమైన నేరం. సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ప్రధానమంత్రి మోడీ డిగ్రీ పత్రాలను సమర్పించాలంటూ గుజరాత్ యూనివర్సిటీకి కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) 2016లో ఇచ్చిన ఆదేశాన్ని గుజరాత్ హైకోర్టు ఇటీవలే కొట్టివేసింది. దీనితో పాటు మోడీ డిగ్రీ సర్టిఫికెట్లు కోరిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.25,000 జరిమానా విధించిన విషయం విదితమే.
మోడీ సర్టిఫికెట్లపై ప్రజల్లో చర్చ
ఈ తీర్పు తర్వాత మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల గురించి ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాని మద్దతుదారులు కూడా ఏంటీ తీర్పు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మోడీ పట్టా అసలైనదా? నకిలీదా? అనే సందేహం ప్రజల్లో పెరుగుతున్నదని విశ్లేషకులు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ కోర్టు ఆదేశాలపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే.. ప్రధానికి కనీస విద్యార్హత ఎందుకు అవసరమో ప్రజలకు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేల విద్యార్హత గురించి భారత రాజ్యాంగం నుంచి పొందిన అవగాహన ఏమి చెబుతుంది? విద్య కంటే, మనం నాయకులను ఏ ప్రమాణాల ఆధారంగా అంచనా వేయాలి? అనే ఆలోచనలు, ప్రశ్నలు దేశ ప్రజల్లో మెదులుతున్నాయి.
పట్టా వివాదం ఎక్కడ మొదలైంది?
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుడు, మాజీ న్యాయ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ తన అఫిడవిట్లో నకిలీ డిగ్రీని దాఖలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్న స్మృతి ఇరానీ కూడా నకిలీ పట్టా కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఢిల్లీ పోలీసులు జితేంద్ర సింగ్ తోమర్ విషయంలో చూపిన శ్రద్ధ, స్మృతి ఇరానీ విషయంలో అంతగా చూపించలేదు.అనంతరం జితేంద్ర సింగ్ తోమర్‌ను అరెస్టయ్యారు. 2015లో నకిలీ డిగ్రీ కారణంగా ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు కూడా ఈ ఏడాది ఢిల్లీ శాసనసభలో ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. స్మ్రృతి ఇరానీ నేటికీ కొనసాగుతూనే ఉన్నారు. దీంతో డిగ్రీ పత్రాల గొడవ అక్కడి నుంచి మొదలైంది. ఆప్ నేతలు తమ డిగ్రీలు చూపించి.. ప్రధాని కూడా డిగ్రీ చూపించాలని సవాల్ విసిరారు. మోడీ పట్టా నకిలీదా కాదా అని దేశం తెలుసుకోవాలనుకునే స్థాయికి ఈ సవాలు చేరింది.
మోడీ అఫిడవిట్లో విరుద్ధ ప్రకటనలు
2014లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో మోడీ తొలి సారిగా తనకు వివాహమైనట్టు అంగీక రించారు. 2014కు ముందు జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మోడీ తన అఫిడవిట్లో పెండ్లి అయి నట్టు అంగీకరించలేదు. ఎన్నికల అఫిడవిట్లలో పరస్పర విరుద్ధ ప్రకట నలు ప్రజలలోనే కాకుండా ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల్లో కూడా కొంత అనుమానాలు రేకెత్తించాయి. తన పెండ్లి గురించి తప్పుడు సమాచారం ఇవ్వగల వ్యక్తి.. తన గురించి కూడా తప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వడనే ప్రశ్నలు తలెత్తాయి. ఎన్నికల అఫిడవిట్లలో చదువుతో పాటు అందజేసిన ఇతర సమాచారం సరైనదా కాదా అనే సందేహం కూడా ఇక్కడ నుంచే మొదలైంది.
పలు ఆర్టీఐ దరఖాస్తులు నమోదు
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మోడీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీని, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి దూర విద్యలో ఎంఏ పట్టా పొందారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ), ఎన్నికల సంఘం(ఈసీ), ఢిల్లీ యూనివర్సిటీ(డీయూ), గుజరాత్ యూనివర్సిటీ(జీయూ)ల్లో అనేక ఆర్టీఐలు దాఖలయ్యాయి. ఈసీని అడగాలని పీఎంఓ సమాధానమిస్తే, ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్లి చూడాలని ఈసీ నుంచి సమాధానం వచ్చింది. 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ఈ సమాచారాన్ని బహిరంగపరచలేమని గుజరాత్ విశ్వవిద్యాలయం బదులిచ్చింది.
కేజ్రీవాల్ లేఖతో స్పందించిన సీఐసీ
ఢిల్లీ నివాసి హన్స్‌రాజ్ జైన్ కూడా డీయూ ఆర్టీఐ దాఖలు చేసి మోడీ డిగ్రీ గురించి ఆరా తీశారు. అతనికి కూడా పూర్తి సమాధానం రాలేదు. ఏప్రిల్ 2016లో, అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులుకు చాలా కఠినమైన పదాలతో లేఖ రాశారు. మోడీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. సీఐసీ ఈ లేఖను ఆర్టీఐ దరఖాస్తుగా పరిగణించింది. ప్రధాని మోడీ డిగ్రీకి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని జీయూ, డీయూలను ఆదేశించింది. దీని తర్వాత బీజేపీ నేతలు అమిత్ షా, అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో మోడీ బీఏ, ఎంఏ డిగ్రీలను బహిరంగపరిచి అరవింద్ కేజ్రీవాల్ దేశానికి చెడ్డపేరు తెచ్చారన్నారు.
ప్రజాచట్టం ఎలా ఉండాలి?
ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లో విద్యార్హత షరతును కొనసాగించాలా వద్దా అనే అంశంపై రాజ్యాంగ పరిషత్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా భారత్‌లోని అధిక జనాభా ఉన్నత విద్యకు దూరంగా ఉన్నది. అంటే, మనం డిగ్రీలకు ఒక నిబంధన చేస్తే, ఇప్పుడు కూడా పెద్ద సంఖ్యలో జనాభా ప్రజాస్వామ్యానికి దూరమవుతుంది. చదువు చాలా ముఖ్యమని అందరికీ తెలుసు. అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి విద్యను తప్పనిసరి చేయడం అంటే ప్రజాస్వామ్యం నుంచి పెద్ద సంఖ్యలో జనాభాను మినహాయించే వ్యవస్థను సష్టించడం. ఇది అన్యాయం అవుతుంది. విద్యార్హత వంటి ఏదైనా షరతు విధిస్తే పేద, బడుగు బలహీన ప్రజలు, మహిళలు వంటి పెద్ద జనాభా ఎన్నికల పోటీలో పాల్గొనలేరు. దీంతో భారత ప్రజాస్వామ్యం కాగితాలకు మాత్రమే పరిమితమవ్వాల్సి ఉంటుంది. మరో వారంలో రాజ్యాంగ నిర్మాత జయంతి వస్తున్న సందర్భంంలో ఈ విషయం చర్చనీయాంశం కావాల్సిందేనని నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
నకి'లీలలు'
- పైసా కొట్టు.. డిగ్రీ పట్టు
- దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా 'ఫేక్' దందా
- ఢిల్లీ నుంచి గల్లీ వరకు పాకిన కల్చర్
దేశంలో డిగ్రీ సర్టిఫికెట్ అంగట్లో సరుకుగా మారింది. పైసా ఉంటే చాలు.. కోర్సుతో సంబంధం లేకుండా ఏ డిగ్రీకి సంబంధించిన ఫేక్ సర్టిఫికెటైన సులభంగా పొందొచ్చు. ఏండ్లుగా కష్టపడి చదవాల్సిన అవసరం లేకుండానే డిగ్రీ పట్టాలు చిటికలో చేతికి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ నకిలీ సర్టిఫికెట్ల దందా రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలతో పాటు ద్వితీయశ్రేణి నగరాలు, చిన్న పట్టణాల వరకూ ఈ ఫేక్ సర్టిఫికెట్ కల్చర్ వ్యాపించింది. దీంతో రేయింబవళ్లు కష్టపడి డిగ్రీ, పీజీ పట్టాలు పొందినవారి శ్రమ గుర్తింపునకు నోచుకోవడం లేదు.
దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఫేక్ సర్టిఫికెట్ దందాలు బయట పడ్డాయి. ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో పోలీసులు ఫేక్ సర్టిఫికెట్ తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ కేసులు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ-చెన్నై, బెంగళూరు యూనివర్సిటీ, ఛత్రపతి శాహు జి మహారాజ్ యూనివర్సిటీ-కాన్పూర్, రాజస్థాన్ యూనవర్సిటీ ఫర్ హెల్త్ సైన్స్, సిమ్బయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ యూనివర్సిటీ)-పూణే వంటి ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన డిగ్రీ సర్టిఫికెట్లు, ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యూపీలోని నోయిడాలో ఫేక్ డిగ్రీలు, సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గతేడాది సెప్టెంబరులో పట్టుకున్నారు. నిందితులు పాట్నకు చెందిన ఆనంద్ శేఖర్, బులంద్‌షహర్‌కు చెందిన చిరాక్ శర్మలు ఈ రాకెట్‌ను నడిపించారు. వారి వద్ద నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన 85 నకిలీ మార్క్షీట్లను, పలు కాలేజీలకు చెందిన 58 ఎన్వెలప్లను, ఏడు బ్లాంక్ రిపోర్టు కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక నకిలీ డాక్యుమెంట్ కోసం వారు రూ. 30వేల నుంచి రూ.70 వరకు వసూలు చేశారని పోలీసులు చెప్పారు.
మహారాష్ట్రలో గతేడాది నవంబర్‌లో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందాలని చూసిన 69 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 50 మంది మహారాష్ట్ర ప్రభుత్వోద్యోగులే కావడం 'నకిలీ' సర్టిఫికెట్ల దందాకు అద్దం పడుతున్నది. ఈ 69 మంది ఆరోగ్యశాఖలోని మల్టిపర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీడబ్ల్యూ) పరీక్షలో ఉత్తీర్ణత సాధింనవారు. వీరు ఫేక్ సీజనల్ స్ప్రేయింగ్ సర్టిఫికెట్‌ను (ఈ సర్టిఫికెట్ ఉంటే రిజర్వేషన్ పొందే వీలుంటుంది) పొందినట్టు ఆరోపణలు రావడంతో నకిలీ బాగోతం బయటపడింది.