Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6 వేలు దాటిన కేసులు
- అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి దేశంలో మరోమారు కోరలు చాస్తోంది. రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూపోతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు గడిచిన 24 గంటల్లో 6050 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 203 రోజుల్లో ఇదే అధికం. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 28,303కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాది సెప్టెంబరు 16న 6,298 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా 24 గంటల్లో 14 మంది చనిపోయారు. దీంతో కోవిడ్ బాధిత మృతుల సంఖ్య 5,30,943కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతంగా నమోదవ్వగా, వీక్లీ పాజిటివిటీరేటు 3.02 శాతంగా వుంది. ఇప్పటివరకు మొత్తంగా కోవిడ్ కేసులు 4.47 కోట్లుగా నమోదు కాగా, క్రియాశీల కేసులు అందులో 0.06 శాతంగా వున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ నుండి కోలుకున్నవారి సంఖ్య 4,41,85,858గా వుండగా, రికవరీ రేటు 98.75 శాతంగా వుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అదనపు చీఫ్ సెక్రటరీలతో ఆన్లైన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా వుండాల్సిందిగా కోరారు. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, జీవన విధానంపై కూడా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిందిగా కోరారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం వుండాలని కోరారు. అన్ని ఆస్పత్రుల్లో ఈ నెల 10, 11 తేదీల్లో మాక్‌డ్రిల్స్ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులను కోరారు. జిల్లాల యంత్రాంగంతో ఈ నెల 8, 9 తేదీల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.