Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీల్డ్ కవర్‌పై హెచ్చరికల ప్రభావం చూడాల్సి వుందని వ్యాఖ్య
న్యూఢిల్లీ : మలయాళం వార్తా చానెల్ మీడియావన్పై కేంద్ర ప్రభుత్వ నిషేధాన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఎన్‌ఎజె), ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్ (డియుజె) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యుజెఎఫ్) స్వాగతించాయి. కానీ సీల్డ్ కవర్ పద్దతిపై హెచ్చరికలను ఆందోళనతో గమనించాయి. సిఎఎ నిరసనలను, ఢిల్లీ అల్లర్లపై మీడియా వన్ చాలా విస్తృత కవరేజీ ఇచ్చింది, ఆ సమయంలోనే 2020 మార్చిలో 48గంటల పాటు చానెల్ ప్రసారాలను కూడా నిలిపివేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై ఇలా ఆంక్షలు విధించడం వల్ల పౌరులు కూడా అదే రీతిలో ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను జర్నలిస్టు సంఘాలు స్వాగతించాయి. సామాజిక, ఆర్థిక రాజకీయాల నుండి రాజకీయ సైద్ధాంతిక భావజాలం వరకు అన్ని అంశాలపై ఒకే రకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం ప్రజాస్వామ్యానికి తీరని ముప్పు అని కోర్టు వ్యాఖ్యానించడం పట్ల జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ సంస్థలన్నీ చాలా తరచుగా సీల్డ్ కవర్ పద్ధతిని ఉపయోగిస్తూ వుంటాయని, ముఖ్యంగా యుఎపిఎ కేసుల్లో ఇది ఎక్కువ చూస్తుంటామని ఎన్‌ఎజె-డియుజె పేర్కొన్నాయి. ఇలా సీల్డ్ కవర్‌ను అందచేయడం వల్ల తమపై ఎందుకు అభియోగాలు మోపారో నిందితులకు తెలుసుకునే అవకాశాన్ని తిరస్కరించడమే అవుతోందని జర్నలిస్టు యూనియన్లు పేర్కొన్నాయి. దాంతో వారికి తమ వాదన వినిపించడం కష్టంగా మారుతోంది. అంతిమంగా వారికి న్యాయాన్ని తిరస్కరించడానికి దారితీస్తోంది. ఇటువంటి ఈ పద్ధతిపై సుప్రీం కోర్టు విమర్శలు చేయడం స్వాగతించదగ్గ పరిణామమని ఆ యూనియన్లు వ్యాఖ్యానించాయి. అయితే ఇటువంటి కేసుల్లో నిందితుడికి నేరుగాసమాచారం ఇవ్వడం కన్నా అమికస్ క్యూరీని నియమించి వారికి ఇవ్వాలని సూచించడం ద్వారా సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలను సమతుల్యం చేసింది. తాజాగా చేసిన ఈ సూచనతో భవిష్యత్తులో కేసులు ఎలా ప్రభావితమవుతాయో చూడాల్సి వుంది. అయితే మొత్తంగా బహిరంగ న్యాయం కోసం జరిగే న్యాయ పోరాటంలో ఈ తీర్పు ఒక ముందడుగు అని ఎన్‌ఎజె, డియుజె, ఎపిడబ్ల్యుజెఎఫ్ అభివర్ణించాయి.