Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ వర్సిటీ అధికారులకు విద్యావేత్తల వినతి
న్యూఢిల్లీ : 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించినందుకు విద్యార్థులపై తీసుకున్న క్రమశిక్షణా చర్యను ఎత్తివేయాల్సిందిగా 59 మంది విద్యావేత్తలు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులను కోరారు. ఈ మేరకు వారు యూనివర్సిటీ ఛాన్సలర్ యోగేష్ సింగ్‌కు లేఖ రాశారు. డాక్యుమెంటరీ ప్రదర్శనపై దేశంలో అధికారిక నిషేధమేమీ అమలులో లేనందున చర్యలు సబబు కావని వారు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అపూర్వానంద్, సతీష్ దేశ్‌పాండే, నందినీ సుందర్, ఇరా రాజా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుచిత్రాసేన్, విశ్వభారతి ప్రొఫెసర్ సుదీప్త భట్టాచార్య తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు. డాక్యుమెంటరీని ప్రదర్శించిం దుకు సంవత్సరం పాటు పరీక్షలు రాయకుండా ఇద్దరు విద్యార్థులపై యూనివర్సిటీ అధికారులు నిషేధం విధించారు. మరో ఆరుగురిపై ఇతర క్రమశిక్షణా చర్యలు సిఫార్సు చేశారు. విద్యార్థులు నిషేధం విధించేంత తీవ్రమైన నేరం చేశారా అని విద్యావేత్తలు తమ లేఖలో వర్సిటీ ఛాన్సలర్‌ను ప్రశ్నించారు. 'ఎక్కడి నుండైనా సమాచారాన్ని తీసుకుని దానిని వ్యక్తపరిచే హక్కు విద్యార్థులు, అధ్యాపకులకు ఉంటుందన్న విషయం మీకు తెలియనిది కాదు. వారు పెద్దలు. ఏం చేయాలో వారికి మనం చెప్పనక్కర లేదు. ముస్లింల పట్ల బీజేపీ వైఖరిని డాక్యుమెంటరీ ఎత్తిచూపింది. దానిని ప్రదర్శించడం ఎందుకు ప్రమాదకరమో మాకు అర్థం కావడం లేదు' అని వారు పేర్కొన్నారు. డాక్యుమెంటరీ ప్రదర్శన ఎలాంటి హింసకు, ఆందోళనకు దారి తీయలేదని గుర్తు చేశారు. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని దానిని బలవంతంగా అడ్డుకొని నిలిపి వేయకుండా ఉంటే అంతా శాంతియుతంగా జరిగి ఉండేదని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. గుజరాత్ అల్లర్లకు ప్రధాని నరేంద్ర మోడీయే బాధ్యుడంటూ జనవరి17న బీబీసీ ఒక డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రప్రభుత్వం ఐటీ నిబంధనల కింద తనకున్న అధికారాలను ఉపయోగించుకొని డాక్యుమెంటరీని ప్రదర్శించవద్దని జనవరి 20న యూట్యూట్, ట్విటర్లకు హుకుం జారీ చేసింది. మరోవైపు దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ, ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కొల్‌కతాలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీలలో డాక్యుమెంటరీ ప్రదర్శనలు జరిగాయి. జనవరి 28న డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధపడిన 24 మంది ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు నిర్బంధించి, గంట తర్వాత విడిచిపెట్టారు. ఆ తర్వాత యూనివర్సిటీ క్రమశిక్షణా సంఘం ఇద్దరు విద్యార్థులపై పరీక్షలకు హాజరు కాకుండా నిషేధం విధించింది.