Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే 20 నుండి ప్రచారోద్యమం : ఏఐకేఎస్ నేతలు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
త్రిపురలో ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత బీజేపీ-ఆర్ఎస్ఎస్ శక్తులచే భీకరమైన హింసను ఎదుర్కొంటున్న త్రిపుర ప్రజలకు అఖిల భారత కిసాన్‌సభ (ఏఐకేఎస్) దేశవ్యాప్త సంఘీభావ ప్రచారాన్ని నిర్వహించనుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)ను కలిసి వామపక్ష, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు, ప్రజలపై జరుగుతున్న దాడులను నివేదిస్తామని ఆ సంఘం నేతలు తెలిపారు. త్రిపుర ప్రజలకు సంఘీభావంగా మే 20 నుంచి 30 వరకు ప్రచారోద్యమం చేపడతామని వెల్లడించారు. శుక్రవారం నాడిక్కడ ఏఐకెేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐకెేఎస్ త్రిపుర ప్రధాన కార్యదర్శి పబిత్రా ఘర్ మాట్లాడారు. రాష్ట్రంలో 216 కుటుంబాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ఇచ్చే రేషన్ తీసుకొనేందకు కూడా అనుమతించటం లేదని అన్నారు. ఇప్పటి వరకు ఐదుగురిని హత్య చేశారని, హింసాకాండలో 630 మందిపై భౌతిక దాడి చేయడంతో గాయాలు పాలయ్యారని తెలిపారు. 1,647 ఇండ్లను ధ్వంసం చేసి, లూటీ చేసి తగులబెట్టారని వివరించారు. దుకాణాలు తెరవడానికి, ఆటోలు నడపడానికి బీజేపీ అనుమతించని పరిస్థితి నెలకొందని, ఒకవేళ ఎవరైనా దుకాణాలు తెరిస్తే, ఆటోలు తీస్తే వారిని హత్య చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారని తెలిపారు. మార్చి 3న ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత నుంచి ఇప్పటి వరకు కొంత మంది దుకాణాలు కూడా తెరవలేదని అన్నారు. 95 దుకాణాలను ధ్వంస చేశారని తెలిపారు. వెయ్యి ఎకరాల్లో 211 రబ్బరు తోటలు దగ్ధం చేశారని, దాదాపు 500 ఎకరాల్లో 286 కూరగాయల తోటలు ధ్వంసం చేశారని వివరించారు. 60 చేపల చెరువులను విషపూరితం చేయడంతో చేపలు నాశనమయ్యాయని, చాలా చోట్ల నీటిపారుదల వ్యవస్థ ధ్వంసం చేశారని తెలిపారు. నిరంతరం గోమాత అంటూ ప్రగల్భాలు పలికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ పది ఆవులు, గేదేలను కాల్చేశారని, 15 మేకలు, 20 బాతులు, కోళ్లను సైతం తగలు బెట్టారని వివరించారు. 22 ఇండ్ల నుంచి బాతులు, కోళ్లు వంటి వాటిని దొంగిలించారని, 41 వాహనాలను ధ్వంసం చేశారని తెలిపారు. పౌల్ట్రీ ఫామ్‌లను, మిరప తోటనలు కాల్చారని అన్నారు. హింసా ఘటనలను పరిశీలనకు వచ్చిన ఎంపిల బృందంపైనా దాడి చేశారు. సీపీఐ(ఎం) ఎమ్మెల్యే శైలేంద్ర చంద్రకాంత్‌కు చెందిన రూ.20 లక్షల విలువ చేసిన రబ్బరు తోటలు ధ్వంసం చేశారని తెలిపారు.ఏఐకెేఎస్ ఉపాధ్యక్షులు హన్నన్ మొల్లా మాట్లాడుతూ త్రిపురలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ప్రజాస్వామ్యాన్ని హననం చేస్తున్నారని విమర్శించారు. కిసాన్ సభ కార్యకర్తలను, నేతలను శారీరకంగా, మానసికంగా హింసించడమే కాకుండా జీవనాధారంపై దాడికి దిగుతున్నారని దుయ్యబట్టారు. నిరాశ్రయులైన, నిస్సహాయులైన వందలాది మంది ప్రజలు సమీపంలోని అడవుల్లో, రాజధాని నగరం అగర్తలాలోని వివిధ ప్రజా సంఘాల కార్యాలయాలలో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. చివరికి పిల్లల పుస్తకాలు కూడా వదల్లేదని, సెకండియర్, హయ్యర్ సెకండరీ పరీక్షలు జరుగుతున్న సమయంలో గూండాలు పిల్లల పుస్తకాలను తగులబెట్టారని ధ్వజమెత్తారు. ఆటో రిక్షాలు, చిన్న వాహనాలు రోడ్లపై తిరగడానికి లేదని ఆదేశించారని, ధిక్కరించిన వారి వాహనాలను తగులబెట్టారని పేర్కొన్నారు. డబ్బు దోపిడీ అనేక రెట్లు పెరిగిందని, కుటుంబాల నుంచి స్థానిక బీజేపీ మాఫియాలు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. స్కీమ్ వర్కర్లు తమ విధుల్లో చేరడానికి వీలు లేదని, గ్రామీణ ఉపాధి హామీ, త్రిపుర పట్టణ ఉపాధి పథకం కార్మికులు కూడా వారి ఉద్యోగాల నుండి నిషేధించబడ్డారని విమర్శించారు.ఏఐకెేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, విజూ కృష్ణన్ మాట్లాడుతూ త్రిపుర రైతులు, కిసాన్ సభ నాయకులు దేశంలోని సాధ్యమైన అన్ని గ్రామాలను సందర్శించి కార్యక్రమాలను వివరిస్తారని, ఫోటో ఎగ్జిబిషన్, డాక్యుమెంటరీ ప్రదర్శన కూడా నిర్వహిస్తారని తెలిపారు. దేశంలోని నేతలు, ప్రముఖులు త్రిపురలో పర్యటించనున్నారని తెలిపారు.