Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్ వ్యాఖ్యలపై స్టాలిన్ ఆగ్రహం
చెన్నై : గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లులను నిలుపుదల చేస్తూ గవర్నర్ ఆర్ ఎన్.రవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పెండింగ్‌లో ఉన్నాయంటే వాటిని నిరాకరించినట్లేనని గవర్నర్ ఆర్.ఎన్.రవి వ్యాఖ్యానించడంపై స్టాలిన్ మండిపడ్డారు. గవర్నర్ తన పరిపాలనా బాధ్యతల నుంచి తప్పించుకుని, కోట్లాది మంది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రవేశపెట్టిన బిల్లులు, ఆర్డినెన్స్ వంటి 14 పత్రాలను సమ్మతించలేదని అన్నారు. గవర్నర్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ ప్రమాణానికి విరుద్ధంగా, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా తరచూ వ్యవహరిస్తున్న ఆయన తీరు ఖండించదగిందని పేర్కొన్నారు. బిల్లులు, ఆర్డినెన్స్‌లు, చట్ట సవరణలను వెంటనే ఆమోదించకుండా జాప్యం చేస్తూ తన బాధ్యతను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. తగిన కారణాన్ని ప్రభుత్వానికి వెల్లడించడం లేదని, బిల్లులను స్తంభింపచేస్తున్నారని తెలిపారు. దీనిపై ఒత్తిడి తీసుకొస్తే ఏదైనా ప్రశ్నను లేవనెత్తి ఆ బిల్లులు వెనక్కు పంపుతున్నారని విమర్శించారు. దానికి ఆన్లైన్ రమ్మీ నిషేధ చట్టం బిల్లు ఓ ఉదాహరణని అన్నారు.
ద్రవ్య బిల్లులను వెనక్కు పంపే అధికారం గవర్నర్‌కు లేదని అన్నారు. ప్రస్తుతం గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆయన వహించే పదవికి తగదన్నారు. పెండింగ్‌లో ఉంచితేనే నిరాకరించినట్టు అర్థమంటూ మాట్లాడారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షిప్త రూపమే గవర్నర్ అంటూ గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. దానిని మరచి నియంతగా గవర్నర్ భావించడాన్ని మానుకోవాలని కోరారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడమే గవర్నర్ చేసిన పదవీ ప్రమాణానికి కట్టుబడి వ్యవహరించినట్టని తెలిపారు. ఇకనైనా తన బాధ్యతను గుర్తించి దానికి తగినట్టు గవర్నర్ నడుచుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. అయితే సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లులను తనకు పంపిందని అన్నారు. అయితే గవర్నర్‌కు మూడు ఆఫ్షన్స్ ఉంటాయని, ఒకటి బిల్లులను ఆమోదించడం. రెండు అసెంబ్లీ బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచితే వాటిని ఆమోదించలేదని అర్థమని తెలిపారు. పదాలంకరణ కోసం పెండింగ్ అనే పదాన్ని వాడుతున్నామని, అలా చెబితే ఆ బిల్లుని నిరాకరించి నట్లేనని పేర్కొన్నారు. ఉమ్మడి జాబితాలో ఉంటే దానిపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతి పరిశీలనకు పంపుతామని తెలిపారు. అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన అది చట్టం కాదని, అసెంబ్లీ కూడా ఓ భాగమేనని, అందుకే అక్కడి తీర్మానాలను గవర్నర్‌కు పంపుతారన్నారు.