Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఉపాధి'కి ఆటంకంగా అటెండెన్స్ యాప్
- ఇంటర్నెట్ అందక సూపర్వైజర్లు సతమతం
- లబ్దిదారులకు తప్పని తిప్పలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)పై ఆది నుంచీ చిన్న చూపే చూస్తున్నది. ఏటేటా బడ్జెట్లో కోతలు పెడుతూ కూలోళ్ల పొట్టగొడుతూనే ఉన్నది. ఇప్పుడు పని చేసినట్టు నమోదు చేసే మొబైల్ యాప్‌ను తీసుకొచ్చి తిప్పలు పెడుతున్నది. పారదర్శకత కోసమంటూ కేంద్రం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆ యాప్ ఇప్పుడు 'ఉపాధి'కే ఆటంకంగా మారింది. పారదర్శకత పేరుతో 'ఉపాధి'కి పాతరేసే పనిలో మోడీసర్కారు ఉందనే విమర్శలొస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఉపాధి యాప్ అమలు అటు సూపర్ వైజర్లకు, ఇటు పని కోరే లబ్దిదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నది. యాప్ రాక ముందు సూపర్వైజర్లు మ్యాన్యువల్‌గానే ఉపాధి కోరే లబ్దిదారులకు సంబంధించి హాజరు షీట్లను నిర్వహించేవారు. అయితే, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పాత పద్ధతిని తొలగిం చింది. ఈ ఏడాది జనవరి నుంచి 'నేషనల్ మొబైల్ మానిటరింగ్ సాఫ్ట్వేర్(ఎన్ఎంఎంఎస్)' ద్వారా వర్కర్ల హాజరును నమోదు చేయాలని తప్పనిసరి చేసింది. ఉపాధి పనులకు వచ్చే వారి రెండు ఫొటోలను (ఉదయం, సాయంత్రం) సూపర్వైజర్లు ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ యాప్ వినియోగంతో పారదర్శకత పెరుగుదల కంటే ఉపాధికి భంగం కలిగించే విధంగా కనిపిస్తున్నదని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.
అటెండెన్స్ యాప్ ఉపాధికి తీవ్ర అంతరాయం కలిగిస్తున్నది. పని ప్రదేశాల వద్ద ఉండే సూపర్వైజర్లకు నాణ్యమైన ఇంటర్నెట్ అందట్లేదు. పేలవమైన ఇంటర్నెట్తోనే సూపర్వైజర్లు వర్కర్ల ఫొటోలను అప్లోడ్ చేయాల్సి వస్తున్నది. ఇంటర్నెట్ నెట్వర్క్ పేలవంగా ఉండటంతో తాము అటెండెన్స్‌ను సరిగ్గా నమోదు చేయలేకపోతున్నామని బీహార్‌లోని కటిహార్ జిల్లా సిక్కత్ గ్రామానికి చెందిన 'ఉపాధి' సూపర్వైజర్ రీనా దేవీ అన్నారు. రీనా దేవీ లాంటి పరిస్థితే దేశంలోని ఉపాధి హామీ సూపర్వైజర్లు అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా 2.7 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలలో వర్క్సైట్ల నుంచి ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా మస్టర్ల రోల్లు (పని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్న కార్మికులకు సంబంధించిన రికార్డు) ఆప్‌లోడ్ చేశారు.
ఇలా వందలు, వేలాది మందికి సంబంధించిన ఫొటోలను పని ప్రదేశాల నుంచి సూపర్వైజర్లు అప్లోడ్ చేశారు. అయితే, డిజిటల్ అటెండెన్స్ పారదర్శకతను పెంచే విధంగా లేవని కొందరు విశ్లేషకులు తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి అప్లోడ్ చేయబడిన ఫొటోగ్రాఫ్‌లను విశ్లేషించగా ఇది తెలిసింది. 'చాలా ఫొటోలు నిరుపయోగంగా ఉన్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చేలా కనిపించింది. పని ప్రదేశాలకు సంబంధించి సరైన గణాంకాలు లేవు. ఫొటోలలో స్పష్టత లేదు. అటెండెన్స్ షీట్లో ఉన్న సమాచారంతో కార్మికుల ఫొటోలు సరిపోలట్లేదు' అని విశ్లేషకులు తెలిపారు. ఉదాహరణకు.. హర్యానాలోని మేవాట్ జిల్లా బ్లాక్‌లో ఒక చెరువును తవ్వుతున్న నలుగురికి సంబంధించిన ఫొటోలో.. ఎవరి మొఖమూ స్పష్టంగా కనబడలేదు. ఇక బీహార్‌లోని గోపాల్‌గంజ్ నుంచి అప్లోడ్ అయిన ఫొటోలో కార్మికుల ముఖాలు లేవు. వారు చేసిన పనికి సంబంధించిన ఖాళీ రోడ్డు మాత్రమే అప్లోడ్ చేయబడింది.
ఇలాంటి పరిస్థితులు పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. పని చేస్తున్నది నిజమైన లబ్దిదారుడా? కాదా? అన్న దానిని యాప్ గుర్తించలేదని జార్ఖండ్‌లో ఎన్ఆర్ఈజీఏకు చెందిన కార్యకర్త జేమ్స్ హెరెంజ్ అన్నారు. పారదర్శకత పేరుతో తీసుకొచ్చిన ఈ డిజిటల్ అటెండెన్స్ సూపర్వైజర్లకు, కార్మికు లకు అదనపు భారమని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. దీనితో ఉపాధి పనికి అంతరాయం ఏర్పడి కార్మికుల కు ఇబ్బందులు తీసుకొస్తున్నదని చెప్పారు. పారదర్శకత పెరిగి, అవకతవకలు తగ్గాలంటే సోషల్ ఆడిట్లు చక్కని మార్గమని ఎన్జీఆర్ఈజీఏ కార్యకర్త జీన్ డ్రీజ్ అన్నారు. కార్మికులకు సమయానికి చెల్లింపులు జరిగేలా చూడటం మంచి ఫలితాన్ని ఇస్తుందన్నారు.