Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే 43 టిక్కెట్లు కేటాయింపు
బెంగళూరు : కర్నాటక ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపే సామాజిక తరగతుల్లో ఒకటైన లింగాయత్‌లకు కాంగ్రెస్ అగ్రతాబూలం ఇస్తోంది. రెండు విడతల్లో 166 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ వారిలో 43 స్థానాలను లింగాయత్‌లకు కేటాయించడం విశేషం. అయితే 224 సీట్లకు గానూ కనీసం 55 టిక్కెట్లను తమ సామాజిక తరగతికి ఇవ్వాలని కాంగ్రెస్‌లోని లింగాయత్ నాయకులకు డిమాండ్ చేస్తున్నారు. అంటే మరో 12 టిక్కెట్లు తమకు ఇవ్వాలని కోరుతున్నారు. మార్చి 29న ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందుగానే వీరు తమ డిమాండ్లపై పట్టుబట్టడం మొదలుపెట్టారు. మే 10న జరగనున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ మార్చి 25న 124 మంది అభ్యర్థులతో మొదటి జాబితా రూపొందించగా, ఏప్రిల్ 6న 42 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదలైంది. 166 టిక్కెట్లకు గానూ 43 టిక్కెట్లు లింగాయత్‌లకు ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 43 టిక్కెట్లు లింగాయత్‌లకు ఇచ్చింది.
ముఖ్యమంత్రి అభ్యర్ధిగా లింగాయత్ నేత బి.ఎస్.యడ్యూరప్పను పాలక బీజేపీ తెరపైకి తీసుకురాకపోవడంతో ఎన్నికల్లో లింగాయత్ మద్దతును పొందే అవకాశాలు తమకే బాగా వున్నాయని కాంగ్రెస్ లింగాయత్ గ్రూపు భావిస్తోంది. అయితే కాంగ్రెస్ లింగాయత్‌లో ముఖ్యమంత్రి అభ్యర్ది ఎవరూ లేరు. మొత్తంగా లింగాయత్ కమ్యూనిటీ కాంగ్రెస్ వైపే వుందని ఆ పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. టిక్కెట్లు ఎక్కువగా ఇవ్వడం వల్ల పార్టీ విజయావకాశాలు మెరుగయ్యాయని లింగాయత్ నేత ఈశ్వర్ ఖాండ్రె తెలిపారు.