Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందులో అధికార పార్టీ సభ్యులెక్కువుండే అవకాశం
- అలాగైతే నిజం బయటకు రావడం కష్టం
- సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కమిటీతో విచారించాలి : ఎన్సీపీ అధినేత శరద్‌పవార్
న్యూఢిల్లీ : అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక విషయంలో భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్ అభిప్రాయంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విభేదించారు. అదానీకి అత్యధిక వాటాలున్న ఎన్డీటీవీకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ అన్ని విషయాలు తెలుసుకోకుండా కొందరు వ్యక్తులు అదానీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారనీ, పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేశారని అన్నారు. 'అదానీపై ప్రకటన చేసిన హిండెన్‌బర్గ్ గురించి మనం గతంలో ఎప్పుడూ వినలేదు. దీనిపై జరిగిన రచ్చ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు. దేశంలోని ఒక పారిశ్రామిక గ్రూపును లక్ష్యంగా చేసుకున్నారు' అని పవార్ చెప్పారు. ఈ వ్యవహారంపై జేపీసీ కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించే కమిటీ విచారణ జరపడం ముఖ్యమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జేపీసీ విచారణ ప్రారంభమైతే ప్రతిరోజూ మీడియాలో కథనాలు వస్తాయనీ, దీనిపై సుమారు నాలుగు నెలల పాటు అంతటా చర్చ జరగాలని కొందరు కోరుకుంటారని అన్నారు. దానివల్ల నిజం ఎప్పటికీ బయటికి రాదని చెప్పారు. పైగా పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తే దానిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. 'అధికార పార్టీకి వ్యతిరేకంగా జేపీసీ వేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. అధికార పార్టీ సభ్యులు ఎక్కువగా ఉండే కమిటీ విచారణ జరిపితే నిజం ఎలా బయటికి వస్తుంది?' అని పవార్ ప్రశ్నించారు. మోడీని లక్ష్యంగా చేసుకొని అదానీ, అంబానీలను విమర్శించడం సరికాదని చెప్పుకొచ్చారు.
అయితే ఎన్సీపీ అభిప్రాయాలు దానికి ఉంటాయనీ, అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు, తీవ్రమైనవని 19 పార్టీలు అభిప్రాయపడుతున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో మాత్రం ఎన్సీపీ సహా అన్ని పార్టీలూ ఏకాభిప్రాయంతో ఉన్నాయని చెప్పారు. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే గ్రూపు) నాయకుడు సంజరు రౌత్ మాట్లాడుతూ పవార్ వ్యాఖ్యలు ప్రతిపక్షాల ఐక్యతకు ఎలాంటి విఘాతం కలిగించబోవని అన్నారు.