Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ డీవై.చంద్రచూడ్
గువాహతి: ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు చట్టం మానవత్వంతో వ్యవహరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. సమస్య మూలాన్ని తెలుసుకోవాలనీ, దానిని పరిష్కరిం చేందుకు చట్టం ఎల్లప్పుడూ కృషి చేయాలని నొక్కి చెప్పారు. గువాహతి హైకోర్ట్ 75వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగిస్తూ.. చట్టం సమాజంలోని వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని వాటిని ఆచరించేందుకు ప్రయత్నిం చాలని సూచించారు. చట్టాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని ఆచరణలో పెడితే సమాజ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందనీ, న్యాయం లభించే దిశగా అది ఒక ముందడుగు అవుతుందని తెలిపారు. 'స్వతంత్ర న్యాయవ్యవస్థపై ప్రజలు ఆధారపడతారు. వారి నమ్మకం, విశ్వాసంపైనే న్యాయవ్యవస్థ చట్టబద్ధత ఆధారపడి ఉంటుంది. ఆపన్నులైన ప్రజలకు న్యాయస్థానం మొట్టమొదటి, చిట్టచివరి ఆశాకిరణం కావాలి. జాతి నిర్మాణంలో శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడూ పాలు పంచుకోవాల్సి ఉంది' అని చంద్రచూడ్ ఆకాంక్షించారు.