Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా పాలు, పెరుగు కూడా ప్రచారాస్త్రాలుగా మారాయి. రాష్ట్రంలో సహకార సంఘంగా నడుస్తున్న నందిని పాలు, పాల ఉత్పత్తులకు విశేష ఆదరణ ఉంది. కన్నడ ప్రజాజీవనంలో నందిని ఒక భాగంగా మారిన నేపథ్యంలో అమూల్ పాలు, పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. నందిని పాల ఉత్పత్తుదారుల జీవితాలతో అమూల్ ప్రవేశపెట్టడం ద్వారా బీజేపీ చెలగాటం ఆడుతున్నదని అక్కడి ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అమూల్ పాల సరఫరాపై నిషేధం విధించాలని జేడీఎస్, కాంగ్రెస్‌తో పాటు పలు కన్నడ సంస్థలు డిమాండ్ చేశారు. ఈ విమర్శలపై ముఖ్యమంత్రి బొమ్మై స్పందిస్తూ అమూల్ పాలను కొంతమంది ఆన్లైన్లో తెప్పించుకుంటుంటే తామెలా ఆపగలమని చేతులెత్తేశారు. దీంతో ఈ దఫా ఎన్నికల్లో నందిని వర్సెల్ అమూల్ ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. నందిని సంస్థను అమూల్ విలీనం చేయాలని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించినట్టు వార్తలు రావడంతో అది కన్నడనాట మరింత ఆగ్రహాన్ని రాజేసింది. పుండుపై కారం చల్లినట్టుగా నందినీ పెరుగు ప్యాకెట్‌పై హిందీ పదం దహి వుండాలని కర్నాటక పాల సమాఖ్యకు ఒక నిబంధన పెట్టడం కన్నడింగుల కోపం కట్టలు తెంచుకుంటున్నది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని, నందినిని కాపాడాలని, వాటి ఉత్పత్తులను రక్షించాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే డిమాండ్ చేశారు. అమూల్‌ను వ్యతిరేకించి, నందినిని కాపాడేందుకు పోరాటానికి సిద్ధమవాలనీ, కర్నాటక గౌరవాన్ని కాపాడాలని పలు కన్నడ సంస్థలు పిలుపునిచ్చాయి. 'నందిని అన్నది మనకు గర్వకారణం. దాన్ని ఎవరూ మన దగ్గర నుంచి దోచుకోలేరు' అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శివకుమార్ అన్నారు. అమూల్ పాల సరఫరాను ఆపకపోతే తమ పోరాటం కొనసాగుతుందని అనేక కన్నడ సంస్థలు ప్రకటించాయి. వేసవి కావడంతో నందిని పాలు, పెరుగు, నెయ్యి కొంతమేరా తగ్గింది. దాంతో ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న దశలో అమూల్‌ను బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి తీసుకొచ్చిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కర్నాటకలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా నందిని అగ్రస్థాయి పాల ఉత్పత్తిదారుగా నిలిచింది. సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో నందిని ఉత్పత్తులన్నింటినీ తప్పనిసరిగా కాపాడతామని ముఖ్యమంత్రి బొమ్మై శనివారం ప్రకటించారు.