Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి 300 అంతర్జాతీయ సంస్థల వినతి
న్యూఢిల్లీ : భారత్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు సంబంధించిన చట్ట, నియంత్రణా పరమైన విధానాన్ని సమీక్షించాలని 105 దేశాలకు చెందిన 300 సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు బహిరంగ లేఖ రాశాయి. దేశంలో 2016 నుంచి ఇంటర్నెట్ సంస్థలు అందిస్తున్న సేవల్లో 58 శాతం సేవలు నిలిచిపోయాయని ఆ దేశాలు గుర్తు చేశాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరిగిందని ఎత్తిచూపాయి. ఇండియా సివిల్వాచ్ ఇంటర్నేషనల్, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఇన్ ఇండియా, జర్నలిజం వాచ్డాగ్ పాత్రికేయులు సహా పలు పౌర హక్కుల సంఘాలతో కలిసి ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు వ్యతిరేకంగా ఈ అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, ఇతర కీలక అంశాలపై సమాచారం తెలుసుకోవాలని ఇంటర్నెట్ను వెతకడం ప్రారంభం కాగానే ఆ సేవలు ఆగిపోతున్నాయని అవి గుర్తు చేశాయి. ఎంతో కొంత సంపాదన కోసమో లేదా సమాచారం ఇచ్చి పుచ్చు కునేందుకో ఇంటర్నెట్ను వెతకడానికి ప్రయత్నిస్తే అది మొరాయిస్తోందని తెలిపాయి. భారత్‌లో 2022లో 84 ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారని ఆ లేఖలో ప్రస్తావించారు. ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా భారత్ గత సంవత్సరంలో 184.3 మిలియన్ డాలర్ల మేర నష్టపోయిందని ఒక అధ్యయనం తెలిపింది. 12 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.