Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠ్యాంశాల తొలగింపుపై చరిత్రకారుల డిమాండ్
- తమను సంప్రదించలేదంటూ ఎన్సీఈఆర్టీపై ఆగ్రహం
- ఇది విచ్ఛిన్నకర రాజకీయ యత్నమేనని విమర్శ
న్యూఢిల్లీ : 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి పాఠ్యపుస్తకాలలో కొన్ని చాప్టర్లను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పలువురు చరిత్రకారులు ఎన్సీఈఆర్టీని డిమాండ్ చేశారు. గతంలో పాఠ్యపుస్తకాల రూపకల్పనలో భాగస్వాములైన నిపుణులను సంప్రదించుకుండానే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. రోమిలా థాపర్, జయతీఘోష్ సహా 250 మంది చరిత్రకారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్సీఈఆర్టీ చర్యను వారు ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మార్పులు భారత రాజ్యాంగ నీతికి విరుద్ధమని ఆక్షేపించారు. జాదవ్పూర్, జవహర్లాల్ నెహ్రూ, ఢిల్లీ, అశోకా యూనివర్సిటీలతో పాటు యూనివర్సిటీ ఆఫ్ అమ్స్టర్డామ్ సహా పలు విద్యాసంస్థలకు చెందిన విద్యావేత్తలు ఈ ప్రకటనపై సంతకాలు చేశారు. 'చరిత్ర పుస్తకాల నుంచి కొన్ని చాప్టర్లను తొలగించాలన్న ఎన్సీఈఆర్టీ నిర్ణయంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. విచ్ఛిన్నకర ఉద్దేశాలతోనే ఎన్సీఈఆర్టీ ఈ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నీతి, భారత ఉపఖండపు అవిభక్త సంస్కృతికి ఈ నిర్ణయం వ్యతిరేకం. అందువల్ల దీనిని సాధ్యమైనంత త్వరగా రద్దు చేయాలి' అని వారు ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. గతంలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల రూపకల్పనలో భాగస్వాములైన కమలానెహ్రూ కళాశాలకు చెందిన విక్టోరియా పాషంగ్బామ్, జీసస్ అండ్ మేరీ కళాశాలకు చెందిన మాయా జాన్, రమ్జాస్ కళాశాలకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ముకుల్ మంగాలిక్ తదితరులు ఈ ప్రకటనపై సంతకాలు చేశారు. చరిత్రకారులు, అధ్యాపకులు సహా పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాలుపంచుకున్న వారిని సంప్రదించేందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదనీ, ఎన్సీఈఆర్టీ సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోలేదని వారు విమర్శించారు. 'కోవిడ్ మహమ్మారి కారణంగా ఎదురైన ఇబ్బందులను, జాతీయ విద్యావిధానం-2020ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే పేరుతో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో కొన్ని చాప్టర్లను తొలగించింది. ఇందులో భాగంగానే మొఘల్ చరిత్ర, కులం-అసమానతల ప్రస్తావనలు, 2002 గుజరాత్ అల్లర్లు, మహాత్మాగాంధీ జీవితం-హత్య వంటి చాప్టర్లు మాయమయ్యాయి. విద్యార్థులపై భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందంటూ అందుకు కోవిడ్, లాక్డౌన్ను సాకుగా చూపడం వివాదాస్పదమే' అని చరిత్రకారులు అభివర్ణించారు. '6-12 తరగతులకు చెందిన సామాజిక శాస్త్రం, చరిత్ర, రాజకీయ శాస్త్రం పాఠ్యపుస్తకాల నుంచి మొఘలుల చరిత్ర, 2002 గుజరాత్ మత ఘర్షణలు, అత్యవసర పరిస్థితి, దళిత రచయితల ప్రస్తావన, నక్సలైట్ ఉద్యమం, సమానత్వం కోసం పోరాటం వంటి చాప్టర్లను వారు తొలగించారు. అయితే కోవిడ్ అనంతరం పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుతున్న తరుణంలో, ఆన్లైన్ పద్ధతి అవసరం లేని ప్రస్తుత సమయంలో సైతం నూతన పాఠ్యపుస్తకాలలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి' అని వారు విమర్శించారు. విలువైన సమాచారాన్ని పొందే అవకాశాన్ని విద్యార్థులకు దూరం చేయడం సమస్యలకు దారి తీస్తుందనీ, ప్రస్తుత, భవిష్యత్ సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన విలువలు వారికి అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. చరిత్రకారుల ఏకాభిప్రాయంతోనే మార్పులు, చేర్పులు చేయాలని వారు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కొన్ని చాప్టర్లను తొలగించడం విచ్ఛిన్నకర రాజకీయం అవుతుందని విమర్శించారు. ఈ రాజకీయాల కారణంగానే మొఘలుల చరిత్రను పాఠ్యపుస్తకాల నుంచి కనుమరుగు చేశారనీ, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన అంశాల జోలికి వెళ్లలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రను సరిగా అవగాహన చేసుకోకుండా పాఠ్యాంశాలను తొలగించడం మతోన్మాదమే అవుతుందన్నారు. ఇది పాలకుల విచ్ఛిన్నకర మత, కుల అజెండాను బహిర్గతం చేస్తోందని చరిత్రకారులు విమర్శించారు.