Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 నిమిషాలు నడిపిన ముర్ము
తేజ్‌పూర్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం అసోంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్ 30 (ఎంకేఐ) ఫైటర్ జెట్‌లో 30 నిమిషాలపాటు సోర్టీని చేపట్టారు. సుఖోరు జెట్ ఉదయం 11:08 గంటలకు బయలుదేరి...11.38 గంటలకు ల్యాండ్ అయింది. సుఖోయ్‌లో ప్రయాణించిన దేశానికి రెండో మహిళా అధ్యక్షురాలిగా ముర్ము నిలిచారు. అంతకు ముందు మాజీ రాష్ట్రపతి ప్రతిభా సింగ్ పాటిల్ కూడా సుఖోయ్‌లో ప్రయాణించారు.ఎయిర్‌ఫోర్స్ అధికాలు వివరాల ప్రకారం, రాష్ట్రపతి 30 నిమిషాల విమానంలో బ్రహ్మపుత్ర , తేజ్‌పూర్ వ్యాలీని కవర్ చేశారు. ఈ విమానం సముద్ర మట్టానికి దాదాపు రెండు కిలోమీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ విమానాన్ని 106 స్క్వాడ్రన్ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ నవీన్ కుమార్ నడిపారు. విమాన ప్రయాణానికి ముందు వైమానిక దళ కార్యాచరణ సామర్థ్యం గురించి అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అయితే మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ రెండు రికార్డులు సృష్టించారు.ముర్ము కంటే ముందు, దేశ 12వ రాష్ట్రపతి ప్రతిభా సింగ్ పాటిల్ 2009లో సుఖోయ్‌లో ప్రయాణించారు. ప్రతిభా పాటిల్ సుఖోయ్‌లో ప్రయాణించి రెండు ప్రపంచ రికార్డులు సష్టించింది. మొదటిది- సుఖోయ్‌లో ప్రయాణించిన ప్రపంచంలో తొలి మహిళా అధ్యక్షురాలు. రెండవది - అతి పెద్ద వయసు(74 ఏండ్ల) ఉన్న మహిళగా ప్రతిభా పాటిల్ రికార్డు సాధించారు. ఆమె పేరు గిన్నిస్ బుక్‌లో కూడా నమోదైంది.ప్రతిభా పాటిల్ కంటే ముందు, డాక్టర్ అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు జూన్ 8, 2006న సుఖోయ్ నడిపారు. అలా ఫీట్ చేసిన దేశానికి తొలి రాష్ట్రపతి ఆయనే. అతని తర్వాత ప్రతిభా పాటిల్ సుఖోయ్‌లో పయనిస్తే.. ఇప్పుడు ద్రౌపది ముర్ము అలా చేసిన మూడవ రాష్ట్రపతి కావటం విశేషం. నిర్మలా సీతారామన్ కూడా 2018 జనవరి 17న రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు సుఖోయ్ 30ఎంకేఐలో ప్రయాణించారు. దేశంలోనే అత్యాధునిక యుద్ధ విమానమైన సుఖోయ్‌లో ప్రయాణించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది.