Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరకొర వేతనాలు, అభద్రత
- ఏ రంగంలో చూసినా ఇదే పరిస్థితి
- పడిపోతున్న వినియోగ వ్యయం
- వాస్తవాల వక్రీకరణలో ప్రభుత్వ అనుకూల ఆర్థికవేత్తలు
- వ్యవసాయంలో కొంత మెరుగు
'ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం.. సర్వం కార్పొరేట్ మయం..ప్రజల బతుకులు వీధులమయం..' అన్నట్టుగా మోడీ సర్కారు తీరు ఉందని చెప్పటానికి దేశంలో పడిపోతున్న ఉపాధిలేమియే.. ప్రత్యక్ష తార్కాణం. చేద్దామంటే కొలువు లేదు. ఉన్నా అరకొర వేతనమే. అదీ అభద్రతామయమే. ఏపూటకాపూట అన్నట్టు నెట్టుకొస్తున్న పరిస్థితి. ఉప్పూ, పప్పూ, తొక్కూ, నూనె ఇలా ప్రతి దాంట్లోనూ పొదుపే. రెండు కొనేదగ్గర ఒకటి కొంటూ జీవితాలను నెట్టుకొస్తున్న దుస్థితి. ప్రతి ఇంటింటి రామాయణమూ ఇదే. ఓవైపు పెరుగుతున్న నిరుద్యోగ సమస్య..మరోవైపు తగ్గిపోతున్న వినియోగ వ్యయం...ఇంకోవైపు పేదల బతుకులు అస్తవ్యస్తంగా ఉంటే...వాస్తవాలను వక్రీకరిస్తూ 'భారత్ వెలిగిపోతుంది..అచ్చేదిన్' అంటూ ప్రభుత్వ అనుకూల ఆర్థికవేత్తలు తమ భజన కొనసాగిస్తూనే ఉన్నారు.
న్యూఢిల్లీ : కోవిడ్ మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి ప్రజానీకం ఇంకా తేరుకోలేదు. ఓ వైపు ప్రజల వినియోగ వ్యయం తగ్గిపోతుంటే మరోవైపు ఉపాధి లేక యువత అల్లాడిపోతున్నది. వాస్తవానికి వినియోగ వ్యయానికి సంబంధించిన గణాంకాలు 2011-12 నుంచి అధికారికంగా అందుబాటులో లేవు. దీనిపై 2017-18లో సేకరించిన వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకూ విడుదల చేయకుండా తొక్కిపెట్టింది. పైగా అదంతా తప్పులతడక అని ప్రచారం చేస్తున్నది. వినియోగ వ్యయం పడిపోతోందంటూ వచ్చిన ఈ నివేదిక మీడియాలో వెలుగు చూసినా అధికారులు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఉపాధికి సంబంధించిన గణాంకాల సేకరణకు గతంలో అనుసరించిన పద్ధతికి సైతం స్వస్తి చెప్పారు. దీనివల్ల అన్ని వివరాలూ బయటకు రావడం లేదు.
భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న ప్రయివేటు సంస్థ సీఎంఐఈ అందించిన సమాచారాన్ని విశ్లేషిద్దాం. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ఈ సంస్థ అత్యంత వేగవంతమైన సమాచారాన్ని ఇస్తున్నది. అధికారిక గణాంకాలేవీ అందుబాటులో లేకపోవడంతో సీఎంఐఈ అందించిన సమాచారమే కీలకమవుతున్నది. గణాంకాల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం మాదిరిగానే ఈ సంస్థ కూడా నమూనాలను సేకరిస్తున్నది. వీటి ప్రకారం... 2019 మార్చి నుంచి 2023 మార్చి వరకూ దేశంలో కొత్తగా 50 లక్షల ఉద్యోగాలను కల్పించారు. మొదటిసారి లాక్డౌన్ విధించినప్పుడు ఉద్యోగాల కల్పన బాగా పడిపోయింది. ఆ తర్వాత కూడా ప్రభుత్వ అనుకూల ఆర్థికవేత్తలు చెబుతున్నట్టు పరిస్థితి అద్భుతంగా ఏమీ మారలేదు. ఉద్యోగాల కల్పన రేటు మెరుగుపడకపోగా దారుణంగా దిగజారింది.
కొత్త ఉద్యోగాల సంగతేంటీ..?
నాలుగేేండ్ల కాలంలో కేవలం 10.25 లక్షల ఉద్యోగాలు మాత్రమే కొత్తగా వచ్చి చేరాయి. అంటే ఏటా 0.3 శాతం వృద్ధి మాత్రమే కన్పించింది. ఇది దిగ్భ్రాంతి కలిగించే విషయం. జనాభా పెరుగుదల రేటుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దేశంలో పనిచేసే వారిలో ఉద్యోగులే కాదు... వివిధ రంగాలలో పనిచేసే కార్మికులు కూడా ఉంటారు. గడిచిన నాలుగేండ్ల కాలంలో కార్మికుల భాగస్వామ్య రేటు పడిపోతూ వస్తున్నది. 2019 మార్చిలో ఈ రేటు 42.7 శాతం ఉంటే 2023 మార్చి నాటికి 39.8 శాతానికి తగ్గింది. గతేడాది నుంచి మాత్రం కొంత పెరుగుదల కన్పించింది. ఉద్యోగ సంక్షోభంలోని వాస్తవిక పరిస్థితిని కార్మిక భాగస్వామ్య రేటు ప్రతిబింబిస్తుంది. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంటే ఉపాధి కల్పనలో వృద్ధి నెమ్మదించింది. ఇది వారిని తీవ్రమైన నిరాశానిస్పృహలకు లోనుచేస్తోంది. ఉపాధి కోసం వెతకడం కూడా మానుకుంటున్నారు. మహిళల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోంది. ఎందుకంటే వారికి వేతనాలు తక్కువగా లభిస్తున్నాయి. ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది.
చేసే సామర్ధ్యమున్నా...చేతిలో పనేదీ ?
పనిచేయగల వయసున్న వారి సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతున్నది. వారికి ఉపాధి చూపాల్సిన బాధ్యత పాలకులదే. అధికారిక గణాంకాల ప్రకారం 15 ఏండ్లు వయస్సు దాటిన వారు పనిచేయగలరు. దీని ప్రకారం ఈ వయస్సుకు చేరే వారి సంఖ్య ప్రతి ఏటా 1.2 కోట్ల మేర పెరుగుతుందని అంచనా. వీరిలో 50 లక్షల మంది పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఏటా 50 లక్షల అదనపు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ, గడచిన నాలుగేండ్ల కాలంలోనూ కొత్తగా వచ్చిన ఉద్యోగాలు కేవలం 50 లక్షలు మాత్రమే ! 'దేశంలో ఉపాధి కల్పన అస్థిరంగా ఉంది' అని సీఎంఐఈ అధిపతి మహేష్ వ్యాస్ అంటున్నారు. నిర్మాణ రంగంలో మార్చిలో 95.8 లక్షల మంది ఉపాధి కోల్పోయారు (7.23 కోట్ల నుండి 6.28 కోట్లకు). రిటైల్ వ్యాపార రంగంలోనూ ఇదే పరిస్థితి. ఫిబ్రవరిలో ఈ రంగంలో 7.58 కోట్ల మంది పనిచేయగా మార్చి నాటికి ఆ సంఖ్య 6.78 కోట్లకు తగ్గిపోయింది. అంటే ఒక్క నెలలో 80 లక్షల మంది వీధినపడ్డారు.
ఆశాజనకంగా వ్యవసాయరంగం
వ్యవసాయ రంగంలో మాత్రం పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. అనుబంధ పౌల్ట్రీ, ప్లాంటేషన్ రంగాల నుంచి వ్యవసాయ పనులకు మళ్లుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆయా రంగాల నుంచి 60 లక్షల మంది పొలం పనులకు దిగుతున్నారు. మార్చిలో ఇతర రంగాల నుంచి 2.3 కోట్ల మంది వ్యవసాయం వైపు మళ్లారు. దీనివల్ల పంటల దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
అదే సమయంలో కార్మికులకు మెరుగైన వేతనాలు లభించవచ్చు. ఆదాయం సరిగా లేకపోవడం, అభద్రత కారణంగా కార్మికులు పెద్ద సంఖ్యలో వ్యవసాయం వైపు చూస్తున్నారని మహేష్ వ్యాస్ చెప్పారు. వ్యవసాయం వాతావరణం, తదితర అంశాలపై ఆధారపడి ఉన్నప్పటికీ కొంత భద్రత ఉంటుందని వారు నమ్ముతున్నారు.
మొత్తంగా చూస్తే... ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. కొత్త ఉద్యోగాల కల్పన అంతంతమాత్రంగానే ఉంటోంది. అరకొర వేతనాలు, అభద్రత కారణంగా యువత అనేక ఇబ్బందులు పడుతున్నారు. మెరుగైన వేతనాల కోసం తరచూ ఉద్యోగాలు మారుతున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఏమీ లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న అమృత్కాల్, అచ్ఛేదిన్ నినాదాలకు ఇది పూర్తిగా వాస్తవ దూరం.