Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎల్ఐది కూడా అదే దారి దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
- ఆర్బీఐ, అంతర్జాతీయ వాణిజ్య గణాంకాల వెల్లడి
- మోదీ ప్రభుత్వం వద్ద పరిష్కారం లేదు : నిపుణులు, విశ్లేషకులు
గతేడాదికి సంబంధించి భారత్ దిగుమతి-ఎగుమతి డేటాపై రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన సమాచారం ఆందోళనను కలిగిస్తున్నది. ఇది భారత్లో పారిశ్రామిక ఉత్పత్తి వైఫల్యం, ఉపాధి సంక్షోభం పెరుగుతున్న తీరును వివరిస్తున్నది. ప్రబలమైన నిరుద్యోగం భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి. 2014 సాధారణ ఎన్నికలలో 2 కోట్ల వార్షిక ఉద్యోగాల వాగ్దానం నరేంద్ర మోడీ 'అచ్ఛే దిన్'లో ప్రధాన భాగం. కానీ మోడీ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం తాండవిస్తున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన మేకిన్ ఇండియా వంటి పథకాలు విఫలమవుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పథకం మేకిన్ ఇండియా. భారతదేశంలో తయారీని ప్రోత్సహించడానికి మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ), ఎగుమతి రాయితీలు, కొత్త కార్మిక చట్టాలు మొదలైన అనేక పథకాలను ప్రకటించింది. ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్లో ఎక్కువ ఉత్పత్తి చేసి ప్రపంచానికి ఎగుమతి చేయాలని భావిస్తున్నది. అయితే, అంతర్జాతీయ గణాంకాలు, ఆర్బీఐ సమాచారాన్ని బట్టి చూస్తే మేకిన్ ఇండియా, పీఎల్ఐలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని చూపెట్టలేక వైఫల్యం చెందాయి. మోడీ సర్కారు పేలవ పనితీరుతో మేకిన్ ఇండియా ఫెయిలైందనీ, దాని మీద ఆధారపడిన పరిశ్రమలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయని మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు తెలిపారు.
అక్టోబర్-డిసెంబర్ 2022కి సంబంధించిన ట్రేడ్ డేటాలో రిజర్వ్ బ్యాంక్, మీడియా నివేదికలు ప్రధానంగా దృష్టి సారించిన కరెంట్ ఖాతా లోటు (గత ఏడాది ఇదే త్రైమాసికంలో దాదాపు రూ. 2.45 లక్షల కోట్లనుంచి చివరి త్రైమాసికంలో రూ. 1.48 లక్షల కోట్లకు) తగ్గింది. వస్తువుల దిగుమతి-ఎగుమతి లోటు (దాదాపు 6.40 లక్షల కోట్ల నుంచి దాదాపు రూ. 5.49 లక్షల కోట్లకు) పడిపోయింది. కానీ ప్రభుత్వ ఆర్థిక విధానం దృష్ట్యా ఈ త్రైమాసికంలో భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతులు కేవలం రూ. 8.59 లక్షల కోట్లుగా ఉన్నది. గతేడాది ఇది రూ.8.83 లక్షల కోట్లుగా ఉండటం గమనించాల్సిన అంశం. రష్యా నుంచి చౌకైన ముడి చమురును శుద్ధి చేయడం ద్వారా రిలయన్స్ పెట్రోలియం ఉత్పత్తులను తిరిగి ఎగుమతి చేయడాన్ని మినహాయించి, వస్తువుల ఎగుమతి గత సంవత్సరం రూ. 7.44 లక్షల కోట్లతో పోలిస్తే రూ. 6.78 లక్షల కోట్లకు పడిపోయింది.
అయినప్పటికీ సేవల ఎగుమతుల పెరుగుదల కారణంగా చెల్లింపుల బ్యాలెన్స్ కరెంట్ ఖాతాలో లోటు తగ్గింది. సేవల ఎగుమతులు మునుపటి సంవత్సరంతో పోలిస్తే త్రైమాసికంలో రూ. 1.30 లక్షల కోట్లు పెరిగి రూ. 6.79 లక్షల కోట్లకు చేరాయి. అలాగే తొమ్మిది నెలల్లో రూ. 5.31 లక్షల కోట్లు పెరిగి రూ. 19.60 లక్షల కోట్లకు చేరాయి. వీటిలో 45 శాతం ఐటీ సేవలు ఉన్నాయి. మిగిలిన వాటిలో కన్సల్టెన్సీ, అకౌంటింగ్, లీగల్, హెల్త్, టూరిజం మొదలైన సేవలు ఉన్నాయి.
ఏ దేశంలోనైనా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, సాంకేతిక అభివృద్ధి కారణంగా వ్యవసాయం, అసంఘటిత రంగాలలో మిగులుగా మారిన నిరుద్యోగ శ్రామికశక్తికి మెరుగైన ఉపాధిని అందించడానికి తయారీ రంగం సర్వతోముఖంగా విస్తరించడమే ఏకైక మార్గం. పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధిలో వేగవంతమైన వద్ధి కూడా వేతన రేటు పెరుగుదలకు మరియు కార్మికుల జీవన ప్రమాణాల పెరుగుదలకు దారితీస్తుంది. అయితే మోడీ పాలనలో దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నది. ప్రభుత్వ గణాంకాలు, జాతీయ, అంతర్జాతీయ నివేదికలూ ఇదే విషయాన్ని వెల్లడించాయి కూడా. అయితే, మోడీ ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగ యువత సమస్యను పరిష్కరించడంలో మాత్రం విఫలమైందని నిపుణులు అంటన్నారు.
గత సంవత్సరాల్లో ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్స్ (పీఎల్ఐ) పేరుతో వివిధ దేశీయ, విదేశీ కార్పొరేట్లకు ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా మూలధనాన్ని నింపింది. గ్లోబల్ కాంపిటీషన్తో సమానంగా దేశీయ తయారీని తీసుకురావడం, భారత్లో ఉత్పత్తి చేసే కొన్ని ప్రపంచ ఛాంపియన్ కంపెనీలను సష్టించడం దీని ఉద్దేశ్యం. కానీ కేంద్ర అస్తవ్యస్త విధానాల కారణంగా పీఎల్ఐ విజయవంతం కాలేకపోయిందని మార్కెట్ నిపుణులు తెలిపారు.
మేకిన్ ఇండియా, పీఎల్ఐ మొదలైన వాటి ద్వారా ప్రపంచవ్యాప్త ఎగుమతులకు భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చే ఈ విధానం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విజయవంతం కావడం లేదు. నిజానికి, భారతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), ఎగుమతి ఆదాయాలలో తయారీ రంగం యొక్క వాటా క్రమంగా క్షీణిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారత్లోని ఇలాంటి పరిస్థితులు తీవ్ర ఆర్థిక, పారిశ్రామిక సంక్షోభానికి దారి తీయొచ్చని చెప్పారు. మేకిన్ ఇండియాపై మోడీ ప్రభుత్వం ఎన్ని వాదనలు చేసినప్పటికీ ఈ విధానాల ద్వారా భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మరియు ఎగుమతి కేంద్రంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలలో విజయం సాధించేలా కనిపించడం లేదు. భారత అంతర్జాతీయ వాణిజ్య గణాంకాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ సర్కారు వద్ద ఉపాధి కల్పనకు సమర్థవంతమైన పరిష్కారం లేదనీ, భవిష్యత్తులో నిరుద్యోగం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.