Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైల్వేలో మూడున్నర లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులున్నాయి. మార్చి 31 నాటికి దేశంలోని 18 జోన్లలో భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యను రైల్వే వెల్లడించింది. నాన్ గెజిటెడ్ పోస్టుల్లో ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, క్లర్కులు, స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్ల పోస్టులుంటాయి.
ఖాళీగా ఉన్న పోస్టుల్లో 2,885 గెజిటెడ్ పోస్టులు కాగా మిగిలినవి నాన్ గెజిటెడ్ పోస్టులు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతులకు చెందిన 18,670 బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ సంవత్సరం జనవరి 1 నాటికి 6,112 ఎస్సీ, 5,113 ఎస్టీ, 7,427 ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీగా ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల్లో అత్యధికంగా 38,754 పోస్టులు ఉత్తర రైల్వేకు చెందినవి. 36,476 పోస్టులు పశ్చిమ రైల్వేకు, 30,141 పోస్టులు తూర్పు రైల్వేకు, 28,650 పోస్టులు సెంట్రల్ రైల్వేకు చెందినవి. మూడేండ్లలో రైల్వేలో 1,41,886 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీని ప్రయత్నాలు జరుగుతున్నాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 1.03,769 పే లెవల్-1 పోస్టుల (గ్రూప్ డి) భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిందని చెప్పారు. గ్రూప్ ఎ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు యూపీఎస్సీకి ఇండెంట్ పెట్టామని ఆయన తెలిపారు.