Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్కావెంజింగ్ రూల్స్ అమలులో గుజరాత్ సర్కారు విఫలం
అహ్మదాబాద్ : రాష్ట్రంలోని పారిశుధ్య కార్మికుల సంరక్షణ పట్ల గుజరాత్ సర్కారు అలసత్వం ప్రదర్శిస్తున్నది. సెప్టిక్ ట్యాంకులు, మురుగుకాలువలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికుల కోసం ఉద్దేశించిన నిబంధనలను అమలు చేయడంలో గుజరాత్ ప్రభుత్వం విఫలమైంది. అండర్ డ్రైన్లు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే సమయంలో చనిపోతే కార్పొరేషన్‌కు చెందిన క్లాస్ 2 ఆఫీసర్ బాధ్యత వహించాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులు ఇలా చనిపోయిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నప్పటికీ.. ఒక్క ప్రభుత్వ అధికారిపై కేసు నమోదుకాలేదని పారిశుధ్య కార్మిక హక్కుల కార్యకర్త ఒకరు అన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై శానిటరీ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య కార్మికుల సంరక్షణ విషయంలో క్లాస్ 2 ఆఫీసర్ బాధ్యత వహించాల్సి ఉంటుదన్న దానికి సంబంధించిన సర్క్యులర్‌ను 2019లో ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలు విడుదల చేశాయి. అయితే గుజరాత్లో జరిగిన 45 ఘటనల్లో 95 మంది శానిటరీ కార్మికులు చనిపయారనీ, ఏ ఒక్క ప్రభుత్వాధికారిపైనా కేసు నమోదు కాలేదని పారిశుధ్య కార్మిక హక్కుల కార్యకర్త పురుషోత్తమ్ వాఘేలా అన్నారు. గత 15 రోజుల్లోనే మూడు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు పారిశుధ్య కార్మికులు చనిపోయారని తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల మరణాల విషయంలో గుజరాత్ రెండో స్థానంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2018లో డ్రైన్, సెప్టిక్ ట్యాంకు శుభ్రం చేసే పనిలో 13460 మంది ఉన్నారు. 2019 నాటికి అది 58,098కి పెరిగింది.