Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ లిమిటెడ్) బోర్డుకు అదానీ గ్రూపు కార్పొరేటు బ్రాండ్ కస్టోడియన్, కార్పొరేటు వ్యవహారాల అధిపతి అమన్ కుమార్ సింగ్ రాజీనామా చేశారు. అమన్ కుమార్ ఛత్తీస్‌గఢ్‌లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. గతవారం స్టాక్ ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో ఎన్డీటీవీ ఈ విషయాన్ని వెల్లడించింది. కంపెనీ నాన్-ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ పదవి నుంచి అమన్ కుమార్ రాజీనామా చేసినట్టు పేర్కొన్నది. ఏప్రిల్ 1 నుంచి ఆయన రాజీనామా వర్తిస్తుందని వివరించింది. ఇతర అంశాల్లో నిమగమై ఉన్నందున అమన్‌కుమార్ ఈ రాజీనామా చేసినట్టు పేర్కొన్నది.
అమన్ కుమార్ మాజీ ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) ఆఫీసర్. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వమున్న సమయంలో అప్పటి సీఎం రమణ్ సింగ్ ప్రభుత్వంలో అమన్ కుమార్ ఒక శక్తివంతమైన ఉన్నతాధికారిగా ఉన్నారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా కూడా పని చేశారు. అయితే, సర్వీసును వదులుకున్న ఆయన ఐఆర్ఎస్కు రాజీనామా చేసి గతేడాది నవంబర్‌లో అదానీ గ్రూపులో చేరారు. అదానీ గ్రూపు కార్పొరేటు బ్రాండ్ కస్టోడియన్, కార్పొరేటు వ్యవహారాల పదవిలో ఆయన ఉన్నారు. అయితే, ఎన్డీటీవీని అదానీ అధీనంలోకి ఎప్పుడైతే వెళ్లిందో అమన్ సింగ్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్ బోర్డు డైరెక్టర్లలో ఒకరిగా నియమితులయ్యారు. అయితే, ఆస్తుల అవకతవకల కేసులో ఛత్తీస్‌గఢ్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) 2020 ఫిబ్రవరిలో అమన్ సింగ్‌తో పాటు ఆయన భార్య యాస్మిన్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిని హైకోర్టు రద్దు చేసినప్పటికీ.. సుప్రీంకోర్టు సమర్థించడంతో ఈఓడబ్ల్యూ ముందు అమన్ మార్చి 6న హాజరయ్యారు. దీంతో అమన్ సింగ్ ఎన్డీటీవీ బోర్డు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.