Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది విద్యారంగం పునాదినే దెబ్బతీస్తోంది :ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాల తొలగింపును ఖండించిన ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్సీఈఆర్టీ సిలబస్ సవరణలతో చరిత్రను తిరగరాయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఎస్ఎఫ్ఐ ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీపీ. సానూ, మయూక్ బిస్వాశ్ ప్రకటన విడుదల చేశారు. ఎన్సీఈఆర్టీ చరిత్ర సిలబస్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చరిత్ర పాఠ్యపుస్తకం ''ఇండియన్ హిస్టరీ పార్ట్-2కు సంబంధించిన థీమ్స్'' నుంచి మొఘల్ కోర్టులకు సంబంధించిన అధ్యాయాలు, అంశాలను తొలగించడం పట్ల తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. రాజకీయ ఎజెండాకు సరిపోయేలా చరిత్రను తిరగరాసే ఆర్ఎస్ఎస్ ప్రయత్నం విద్య, లౌకికవాదం, ప్రజాస్వామ్యం సూత్రాలను ఉల్లంఘించడమేనని విమర్శించారు.
విద్య ఉద్దేశ్యం తటస్థ, నిష్పాక్షిక దృక్పథాన్ని అందించడమేననీ, అంతేతప్ప ప్రచారాన్ని ప్రోత్సహించడం కాదని పేర్కొన్నారు. తమ ప్రయోజనాలకు అనుగుణంగా చరిత్రను తారుమారు చేస్తూ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యారంగం పునాదినే దెబ్బతీస్తోందని విమర్శించారు. విద్యపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండాలనీ, విమర్శనాత్మక, హేతుబద్ధ ఆలోచనలను ప్రోత్సహించాలని ఎస్ఎఫ్ఐ గట్టిగా విశ్వసిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సవరణలకు వ్యతిరేకంగా నిలబడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు ఎస్ఎఫ్ఐ సంఘీభావంగా నిలుస్తుందనీ, విద్యా వ్యవస్థ సమగ్రతను కాపాడుకోవడానికి ఐక్య పోరాటానికి పిలుపునిస్తామని తెలిపారు. ఈ మార్పులను తిప్పికొట్టడానికి, విద్యా సమగ్రత, మేధో స్వేచ్ఛ సూత్రాలను సమర్థించడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసం చరిత్రను తిరగరాసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. నిజమైన ప్రజాస్వామ్య, నిష్పాక్షిక విద్యా వ్యవస్థను రూపొందించడానికి కృషిచేస్తామని పేర్కొన్నారు.