Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే వేగంగా కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి
- డబ్ల్యూహెచ్ఓ రీజినల్ డైరెక్టర్ సింగ్
న్యూఢిల్లీ : భారత ప్రజల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్లనే కొత్త కోవిడ్ వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ రీజినల్ డైరెక్టర్ (ఆగేయాసియా) డాక్టర్ పూనమ్ క్షేత్రపాల్ సింగ్ అభిప్రాయపడ్డారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే వ్యాధులపై నిఘా వేసి ఉంచడం, ప్రజలకు అధిక సంఖ్యలో వ్యాక్సిన్లు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రజలందరూ బూస్టర్ డోసు వేసుకోవాలనీ, కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. పలు దేశాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెద్దగా ఉండటం లేదని చెప్పారు. వైరస్ కారణంగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనీ, పరిస్థితి గతంలో మాదిరిగా ఉండదని తెలిపారు. అయినప్పటికీ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదని హెచ్చరించారు. కోవిడ్, ఇతర శ్వాసకోశ వ్యాధుల నివారణకు దీర్ఘకాలిక చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లలపై ఇన్ఫెక్షన్ ప్రభావం పెద్దగా ఉండదని చెప్పారు. వీరికి వ్యాక్సిన్ అందించే విషయంపై ఆయా దేశాలు నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 2022 ప్రారంభంలో వచ్చిన కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ సమయంలో నమోదైన కేసుల సంఖ్యకు సమానంగా ప్రస్తుతం వస్తున్నాయి. దేశంలో శనివారం కొత్తగా 6,155 కేసులు వెలుగు చూశాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 31,194కు చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 16 తర్వాత రోజువారీ కేసుల సంఖ్య ఆరు వేలు దాటింది. కోవిడ్ బారిన పడి శనివారం 14 మంది చనిపోయారు. వీరిలో మహారాష్ట్రలో ముగ్గురు, కర్నాటక, రాజస్థాన్‌లో ఇద్దరు చొప్పున, ఢిల్లీ, హర్యానా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, కేరళలో ఒక్కొక్కరు ఉన్నారు.