Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంతాప సభలో వక్తలు
న్యూఢిల్లీ : సునీత్ చోప్రాను ఉద్యమ సహచరులు, స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఇది ఒక అరుదైన విప్లవకారుడి జీవిత చిత్రమని వక్తలు కొనియాడారు. సోమవారం నాడిక్కడ ఏఐఏడబ్ల్యూయూ కేంద్ర కార్యాలయంలో సునీత్ చోప్రా సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ విప్లవకారుడిగా జీవితం గడిపిన సునీత్‌కు, ఇతరుల సామర్థ్యాలను వెలికితీసే అపురూపమైన సామర్థ్యం ఉందన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అన్నింటికంటే మంచి మనిషి అని ఏచూరి పేర్కొన్నారు. కళలు, సాంస్కృతిక రంగాల్లో ఉన్నత వర్గాలతో పాటు, గ్రామీణ వ్యవసాయ కార్మికులతో సమానంగా జీవించిన సునీత్‌ను సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ గుర్తు చేసుకున్నారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మాట్లాడుతూ లండన్‌లో సునీత్ విద్యార్థి జీవితంతో సహ అయన విద్యార్థి ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మాట్లాడుతూ ప్రజల మధ్య జీవించిన సునీత్, సంఘం పనిలో ఉండగానే మెట్రో స్టేషన్ లో కుప్పకూలి మృతిచెందారని తెలిపారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, జాతీయ అధ్యక్షుడు ఎ. విజయరాఘవన్ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి లో కేరళలో ఉన్న సునీత్, ఇఎంఎస్ స్వ గ్రామంలో సీపీఐ(ఎం) ఇంటింటి సందర్శన కార్యక్రమంలో భాగంగా అనేక ఇండ్లను సందర్శించారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సునీత్ తనదైన ముద్ర వేయగలిగాడని విజయరాఘవన్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి విక్రమ్‌సింగ్, జేఎన్‌యూ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్, కళాకారులు, క్యూబా, ఉత్తర కొరియా ప్రతినిధులు, ఏఐకేఎస్ నాయకులు హన్నన్ మొల్లా, విజూ కృష్ణన్, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు విపి సాను తదితరులు నివాళులర్పించారు.