Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురికి గాయాలు
- 10మంది అరెస్టు
చండీఘడ్: హర్యానాలోని సోనీపట్లో గల శాండల్ కలన్ గ్రామంలో లాఠీలు చేతబట్టిన కొంతమంది మతతత్వ గూండాలు మసీదులో చొరబడి అక్కడ నమాజ్ చేస్తున్న వారిపై దాడి చేశారు. మొత్తంగా ఆ స్థలాన్నంతా ధ్వంసం చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడికి సంబంధించి పోలీసులు 10మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటన తర్వాత అదనంగా పోలీసు బలగాలను మోహరించారు. సంఘ వ్యతిరేక శక్తులు కొందరు మసీదులోకి చొరబడి, ప్రార్థనలు చేస్తున్న వారిని కొట్టారని సోనీపట్ పోలీసు కమిషనర్ సతీష్ బాలన్ తెలిపారు. ఈ దాడికి ముందు గ్రామంలో ఇరు గ్రూపుల మధ్య ఎలాంటి ఘర్షణలు, గొడవలు లేవని తెలిపారు. లాఠీలు చేతబట్టుకున్న కొంతమంది వ్యక్తులు గ్రామ వీధుల్లో అటూ ఇటూ తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. లోపల ప్రార్థనలు ఆపాలని కొంతమంది వ్యక్తులు కోరారని, ఆ తర్వాత అక్కడ విధ్వంసం సృష్టించారని స్థానికులు తెలిపారు. దాడికి పాల్పడిన వారు కూడా అదే గ్రామానికి చెంది నవారు, వారిపై ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాలన్ తెలిపారు.