Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీఐ సమాచారంలో వెల్లడి
న్యూఢిల్లీ : ఐఐటీ ధార్వాడ్ కొత్త కేంపస్ ప్రారంభోత్సవానికి కర్నాటక ప్రభుత్వ రూ.9.49కోట్లను ఖర్చు పెట్టిందని ఆర్టీఐ సమాచారం ద్వారా వెల్లడైంది. ఈ ఏడాది మార్చి 12న ప్రధాని మోడీ ఈ క్యాంపస్‌ను ప్రారంభించారు. ప్రజల రవాణాకు, లంచ్‌లు, వేదిక ఏర్పాట్లు, బ్రాండ్లు, ప్రమోషన్లు, ఇతర సదుపాయాల కల్పనకు ఈ మొత్తం ఖర్చయిందని సమాచార హక్కు చట్టం ద్వారా అందిన సమాచారం వెల్లడించింది. ధార్వాడ్‌లో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి పునాది వేయడంతో పాటూ కర్నాటకవ్యాప్తంగా అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించడానికి ముందుగానే ఇది జరిగింది. 2లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో మెజారిటీ మందికి ఆహారం, రవాణా సదుపాయాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక ముఖ్యమంతి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. ఆర్టిఐ ద్వారా సమాచారం కోరిన జనతాదళ్ (సెక్యులర్) నేత గురురాజ్ హమ్సాహి మరద్కు ప్రభుత్వం ఈ సమాచారం అందచేసింది. కార్యక్రమం జరుగుతున్న వేదిక వద్దకు ప్రజలను తీసుకెళ్ళి రావడానికి రూ.2.83కోట్లను హుబ్లి-ధార్వాడ్ జిల్లా యంత్రాంగం భరించింది. హైదరాబాద్, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని పర్యటనలు జరుపుతున్న వేళ ఈ సమాచారం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ హాజరయ్యే కార్యక్రమాలను ఇంత అర్భాటంగా జరుపుతుండడంపై కర్ణాటకలో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ప్రజాధనం పరోక్షంగా మోడీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతోందని అన్నారు. కాగా డిప్యూటీ కమిషనర్ ఫండ్ నుండి ఖర్చు పెట్టిన మొత్తాన్ని మాత్రమే తమకు తెలియచేశారని, కానీ తమ అంచనాల ప్రకారం రూ.20కోట్లు ఖర్చు పెట్టారని హమ్సాహి మరద్ మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రయివేటు వాహనాలను కిరాయికి తీసుకున్నారని, దాదాపు 60వేల మందికి భోజనాలు పెట్టారని, ఈ కార్యక్రమానికి రావడం కోసం మనిషికి వెయ్యి రూపాయిలు ఇస్తామని ప్రలోభ పెట్టి మరీ తీసుకువచ్చారని ఆయన విమర్శించారు.