Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిమినల్స్ డిబార్ పిటిషన్‌పై కేంద్రానికి 4 వారాల సుప్రీం గడువు
న్యూఢిల్లీ : తీవ్రమైన నేరాల్లో అభియోగాలను ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయనివ్వ కుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం కోరింది. అసలు తీవ్రమైన నేరాలంటే ఏమిటో ముందుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం వుందని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన బెంచ్ పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం తన సమాధానాన్ని చెప్పలేదంటూ వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా అదనపు సొలిసిటర్ జనరల్ సంజరు జైన్‌ను బెంచ్ కోరింది. ''ముందుగా మీరు తీవ్రమైన నేరాలేంటో గుర్తించండి, దాన్ని నిర్వచించండి, జులైలో విచారిద్దాం.'' అని బెంచ్ పేర్కొంది. ఈ విషయమై లాయర్ అశ్విని ఉపాధ్యారు వేసిన పిటిషన్‌పై గతేడాది సెప్టెంబరు 28న న్యాయ, హోం మంత్రిత్వ శాఖలకు, ఎన్నికల కమిషన్‌కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ కేసుల్లో అభియోగాలు నమోదైన వారిని నిషేధించడంతో పాటూ అటువంటి అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని, ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని ఆ పిటిషన్ కోరింది. లా కమిషన్ సిఫార్సు చేసినా, కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసినా కేంద్రం, ఎన్నికల కమిషన్ ఆ దిశగా చర్యలు తీసుకోలేదని పిల్ పేర్కొంది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో 539మంది విజేతలు వుండగా, వారిలో 43శాతం మంది అంటే 233 మందిపై క్రిమినల్ కేసులు వున్నాయని పిల్ పేర్కొంది. స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదికలోని గణాంకాలను పిల్ ప్రముఖంగా ప్రస్తావించింది. 2009 నుండి తీవ్రమైన క్రిమినల్ కేసులు వున్న ఎంపీల సంఖ్య 109శాతం పెరిగిందని పిటిషన్ పేర్కొంది. అందులో ఒక పార్లమెంట్ సభ్యుడిపై ఏకంగా 204 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. నేరపూరితమైన రాజకీయాల స్థాయి బాగా పెరిగిపోయిందని, ఓటర్లు రాజ్యాంగం లోని 19వ అధికరణ కింద తమకు కల్పించబడిన ప్రాధమిక హక్కును స్వేచ్ఛగా, సక్రమంగా ఉపయోగించుకోవడం కష్టమై పోతోందని పిటిషన్ పేర్కొంది.