Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే మోడీ సర్కార్ దృష్టి : సోనియా గాంధీ
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్య మూలస్తంభాలను కేంద్ర ప్రభుత్వం కూలదోస్తోందని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ధ్వజమెత్తారు. '' నిర్భందపు మౌనం దేశ సమస్యలను పరిష్కరించదు'' అనే పేరుతో జాతీయ వార్తా పత్రిక సంపాదకీయంలో మోడీ ప్రభుత్వంపై సోనియా విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్ధలోని మూడు స్తంభాలను క్రమపద్ధతిలో కూల్చివేస్తోందని అన్నారు. పార్లమెంటులో ఇటీవల అంతరాయాలను ప్రస్తావించారు. . నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక అంశాలు, అదానీ కుంభకోణం, బడ్జెట్ వంటి అంశాలపై చర్చను మరుగునపడేసేందుకు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం దారుణమని ఆమె మండిపడ్డారు. కీలక సమస్యలు, సున్నిత అంశాలను వదిలివేయడం లేదా ఘాటైన పద ప్రయోగాలతో ఆ అంశాల నుండి పక్కకు తప్పుకోవడం మోడీ ప్రకటనలు ప్రస్ఫుటం చేస్తాయని సోనియా మండిపడ్డారు.
ప్రతిపక్షాలు సమైక్యంగా ప్రభుత్వంపై పోరాడుతుండటంతో వాటిని ఎదుర్కొనేందుకు కేంద్రం అసాధారణ చర్యలను ఆశ్రయిస్తూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని దుయ్యబట్టారు. లోక్సభ ఎంపీగా రాహుల్ గాంధీపై అనర్హత వేటుతో పాటు ఆయన ప్రసంగంలోని కొంత భాగాన్ని పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడాన్ని సోనియా ప్రస్తావించారు.
పార్లమెంట్లో ఎలాంటి చర్చా చేపట్టకుండా రూ. 45 లక్షల కోట్ల బడ్జెట్ను ఆమోదించడానికి రాహుల్ అంశాన్ని లేవనెత్తారని దుయ్యబట్టారు. ఆర్థిక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినపుడు ప్రధాని మోడీ మీడియా కవరేజీతో తన నియోజకవర్గంలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో బిజీగా ఉన్నారని అన్నారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించలేదని మండిపడ్డారు. అంటే దేశంలో 'సమస్యలు లేనట్లే' నా అని ప్రశ్నించారు.
కేంద్ర దర్యాప్తు సంస్ధలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ఈడీ, సీబీఐ కేసుల్లో 95 శాతానికి పైగా ప్రతిపక్ష నేతలపైనే బనాయించారని సోనియా గాంధీ మండిపడ్డారు. అయితే బీజేపీలో చేరిన వారిపై కేసులు మాత్రం ఆవిరవుతున్నాయని ఆరోపించారు. జర్నలిస్టులు,కార్యకర్తలు, ప్రముఖ హక్కుల సంస్థలపై జాతీయ భద్రతా చట్టాలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. అలాగే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రిటైర్డ్ జడ్జీలపై చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుపట్టారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే వ్యవస్థాగత ప్రయత్నమని అన్నారు. ప్రజలను తప్పు దారి పట్టించడానికి, విద్వేషాలను రెచ్చగొట్టడానికి మరియు సేవచేస్తున్న న్యాయమూర్తులను భయపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ''రాజకీయజోక్యం, బీజేపీ కార్పొరేట్ స్నేహితుల ఆర్థిక బలం'' కారణంగా మీడియా తన స్వేచ్ఛలో రాజీపడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ఎస్లు విద్వేషాలను రెచ్చగొడుతూ, హింసకు పాల్పడుతున్నా, ప్రధాని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రధాని ఒక్కసారి కూడా శాంతి సామరస్యాల కోసం పిలుపునివ్వలేదని ధ్వజమెత్తారు. మతపరమైన పండుగలను ఉత్సాహంగా, వేడుకగా జరుపుకోవడానికి బదులుగా ఇతరులను భయపెట్టేందుకు, వేధించేందుకు వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు. పండుగల్లో ఆనందానికి బదులుగా మతం, ఆహారం, కులం, లింగం, భాషల ఆధారంగా వివక్షకు గురవుతున్నారని విమర్శించారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, దీంతో రాబోయే కొద్ది నెలలు మన ప్రజాస్వామ్యానికి కీలకమైన పరీక్ష కానుందని అన్నారు. మోడీ ప్రభుత్వం పలుకీలక రాష్ట్రాల్లో అధికారాన్ని, ఎన్నికలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు భావసారూప్యత ఉన్న పార్టీలన్నింటితోనూ కాంగ్రెస్ చేతులు కలుపుతోందని గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన ప్రకటనను సోనియాగాంధీ పునరుద్ఘాటించారు.