Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీకి సీనియర్లు దూరం
బెంగళూరు : మరికొన్ని రోజుల్లోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆ రాష్ట్రంలో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో విలవిలాడుతున్న బీజేపీకి ఆ పార్టీ సీనియర్ల నుంచి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని కొంత మంది సీనియర్ నాయకులు ప్రకటించడం బీజేపీ అధిష్టానానికి మింగుడు పడటంలేదు.. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి, కురుబా సామాజిక వర్గానికి చెందిన నాయకులు కెఎస్ ఈశ్వరప్ప, మంత్రులు గోవింద్ కర్జోల్, సోమన్న, బీసీ నాగేష్, అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి వంటి ప్రముఖ నాయకులు త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. అలాగే హలది శ్రీనివాస్ షెట్టీ, రవీంద్రనాథ్, మంత్రి ఎంటిబి నాగరాజ్ వంటి నాయకులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్ట పడ్డం లేదు.
ఎన్నికల రాజకీయా నుంచి నిష్క్రమిస్తున్నా : ఈశ్వరప్ప
ఎన్నికల రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు బీజేపీ ప్రముఖ నాయకులు, శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వరప్ప మంగళవారం ప్రకటించారు. బీజేపీ అధ్యక్షులు జెపి నడ్డాకు పంపిన లేఖలో ' ఎన్నికల రాజకీయాల నుంచి స్వచ్ఛంధంగా తప్పుకోవాలనుకుంటు న్నాను. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ఏ నియోజకవర్గం నుంచి కూడా నా పేరు ను పరిగణనలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను' అని ఈశ్వరప్ప పేర్కొ న్నారు. ఈశ్వరప్ప ఎమ్మెల్యే, మంత్రిగానే కాదు, కర్నాటక బీజేపీ అధ్యక్షులు గానూ పని చేశారు. మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పతో కలిసి రాష్ట్రంలో బీజేపీ బలపడ్డానికి కృషి చేశారు. ఇలాంటి ఈశ్వరప్ప ఎన్నికలకు దూరంగా ఉండటం బీజేపీకి నష్టం కలిగించే అంశమే కాగా. తన కుమారుడు కెఇ కాంతేష్ కోసమే ఈశ్వరప్ప ఈ నిర్ణయం తీసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌ను ఈ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం ఆదేశించడంపై షెట్టర్ ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాక.. ఆరు సార్లు అసెంబ్లీకి షెట్టర్ ఎన్నికయ్యారు.నామినేషన్ వేయడానికి కేవలం కొన్ని రోజుల ముందే తనకు అధిష్టానం ఈవిధంగా చెప్పిందని, కనీసం కొన్ని నెలలు ముందు చెప్పినా తనకు గౌరవ ప్రదంగా ఉండేదని ఆయన మీడియాతో వాపోయారు. కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు బుధవారం బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.