Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యంతరాలు నమోదు చేయలేదు
- ఓ వ్యక్తికి అనుకూలంగా సాక్ష్యాలు
- రెజ్లింగ్ సమాఖ్య విచారణ కమిటీ సభ్యుడు
భారత అగ్రశ్రేణి మల్లయోధులు జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నాతో క్రీడా రంగంలో కలవరం రేగింది. వినేశ్ ఫోగల్, సాక్షి మాలిక్, అన్షు మాలిక్ సహా బజరంగ్ పూనియా, రవి దహియలు రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ ఆగడాలపై గళమెత్తారు. రెజ్లర్ల ఆరోపణలపై కమిటీని నియమించిన క్రీడా మంత్రిత్వ శాఖ.. విచారణ ప్రక్రియ ఏకపక్షంగా, ఓ వ్యక్తికి అనుకూలంగా సాగుతున్నప్పటికీ జోక్యం చేసుకోలేదు. ఆరుగురు సభ్యుల విచారణ కమిటీ ఏకపక్షంగానే నివేదికను తయారు చేసిందని కమిటీలోని ఓ సభ్యుడు విమర్శలు గుప్పించటంతో నివేదిక ప్రామాణికతపై అనుమానం కలుగుతుంది!.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్ల లైంగిక ఆరోపణలు, ఫెడరేషన్ నిధుల దుర్వినియోగం పట్ల విచారణకు ఏర్పాటైన కమిటీ.. ఏప్రిల్ 5న కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు పూర్తి నివేదికను అందజేసింది. జనవరి 23న ఏర్పాటైన విచారణ, పర్యవేక్షణ కమిటీ రెండు నెలలకు పైగా సమయం తీసుకుని నివేదిక తయారు చేసింది. దిగ్గజ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షణ కమిటీ రూపొందించిన నివేదికపై ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అందుకు కారణం, పర్యవేక్షణ కమిటీలోని ఓ సభ్యుడే విచారణ ప్రక్రియ, ఏకపక్షంగా వాంగ్మూలం నమోదు సహా తదితర అంశాలపై విమర్శలు చేయటం. అధికారికంగా నివేదికలోని అంశాలను క్రీడాశాఖ బయటకు వెల్లడించకముందే, నివేదిక ఏకపక్షంగా తయారు చేశారనే ఆరోపణలు రావటం గమనార్హం.
అభ్యంతరాలతో సంతకం : ఆరుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీ ఏప్రిల్ 5న నివేదికను అందజేసింది. నివేదికపై సభ్యులు అందరూ సంతకం చేయాల్సి ఉంటుంది. సంతకం చేయడానికి ముందు నివేదికలోని పూర్తి అంశాలను చదివేందుకు సభ్యులకు అవకాశం ఇవ్వలేదని ఓ సభ్యుడు ఆరోపించారు. దీంతో అతడు తుది నివేదికపై సంతకం చేస్తూ, తన అభ్యంతరాలను అక్కడ రాసినట్టు వెల్లడించాడు. ' విచారణ నివేదికను క్రీడామంత్రిత్వ శాఖకు సమర్పించడానికి ముందు సభ్యులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలు పేర్కొంటూ నివేదికపై సంతకం చేశాను. నివేదికను పూర్తిగా చదివేందుకు అవకాశం ఇవ్వలేదు. నేను ఆ అంశంపై అభ్యంతరం తెలిపాను. ఏప్రిల్ 5న క్రీడాశాఖకు సమర్పించిన నివేదికలో నేను లేవనెత్తిన అభ్యంతరాలు తొలగించారనే అంశం అర్థమైంది. అభ్యంతరాలు నమోదు చేయాలని కోరినా.. అది జరుగలేదు. దీంతో నా నిరసన వ్యక్తం చేస్తూనే నివేదికపై సంతకం చేశాను' అని ఓ సభ్యుడు తెలిపాడు. ఆరుగురు సభ్యుల పర్యవేక్షణ కమిటీకి ఎంసి మేరీకోమ్ చైర్మెన్‌గా వ్యవహరించారు. టాప్స్ (టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్) మాజీ సీఈవో రాజగోపాలన్, శారు మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తృప్తి, రెజ్లర్లు యోగేశ్వర్ దత్, బబిత ఫోగట్‌లు సభ్యులుగా ఉన్నారు.
ఓ వ్యక్తికి అనుకూలంగా సాక్షులు : ఇక విచారణ ప్రక్రియపైనా సదరు సభ్యుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఓ వ్యక్తికి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తులు ఎటువంటి రుజువులు చూపించలేదు. కమిటీ సైతం వారి నుంచి ఎటువంటి ఆధారాలు సేకరించేందుకు ఆసక్తి చూపలేదు. 'విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలం వీడియో రికార్డు చేయలేదు. సాక్షుల వాంగ్మూలం కాపీలను సభ్యులతో పంచుకోలేదు. సాక్షుల వాంగ్మూలంపై అటు సాక్షులు, ఇటు సభ్యులు ఎవరూ సంతకం చేయలేదు. సాక్షుల వాంగ్మూలం నిజమా? కాదా? తెలుసుకునే ప్రయత్నం జరుగలేదు. సాక్షులు ఏం చెబితే అదే రాసుకున్నారు. కొందరు సాక్షులు ఓ వ్యక్తికి అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చారు. అందుకు సాక్షులకు నజరానాలు ముట్టినట్టు అనిపిస్తుంది!' అని అన్నారు. విచారణ ప్రక్రియలో అత్యంత కీలకం.. బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ వాంగూల్మం. లైంగిక ఆరోపణల విచారణ సమయంలో బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను వాంగ్మూలాలను న్యాయవాదుల సమక్షంలో నమోదు చేయాలి. లైంగిక ఆరోపణలపై ఫిర్యాదు చేసిన అథ్లెట్ల వాంగ్మూలం న్యాయవాదుల సమక్షంలో తీసుకున్నారు. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ వాంగ్మూలం నమోదు న్యాయవాది లేకుండానే చేశారని వెల్లడించారు.
అంతా ఏకపక్షం : 'కమిటీ సమావేశాల్లో లేవనెత్తిన అభ్యంతరాలను నమోదు చేయలేదు. అభ్యంతరాలను ఎందుకు మీటింగ్ మినిట్స్‌లో రికార్డు చేయలేదని ప్రశ్నిస్తే.. ఆ అంశంపై మరోసారి చర్చిద్దామని దాటవేశారు. ఈ విధంగా నా అభ్యంతరాలను తొక్కిపెట్టారు. నిర్ణయాలు అత్యంత ఏకపక్షంగా తీసుకున్నారు' అని ఆ సభ్యుడు అన్నాడు.
సిఫారసులు ఏవీ? : రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై విచారణ చేయటంతో పాటు పరిపాలన, ఇతర అంశాల పట్ల రెజ్లర్లు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపేలా సిఫారసులు సైతం చేయటం పర్యవేక్షణ కమిటీ బాధ్యత. కానీ మేరీకోమ్ కమిటీ ఆ విషయాన్ని విస్మరించిందని కమిటీ సభ్యుడు విమర్శించాడు. ' రెజ్లర్లు ఆందోళన సందర్భంగా లేవనెత్తిన ఆరోపణలపై ఎటువంటి సిఫారసులు చేయలేదు. రెజ్లర్ల ఆరోపణలకు మద్దతు లేదా విభేదించేలా ఎటువంటి సూచనలు రాయలేదని' ఆయన అన్నాడు. లైంగిక ఆరోపణలు, నిధుల దుర్వినియోగం సహా రెజ్లర్లకు ప్రయివేట్ స్పాన్సర్‌షిప్‌ల అంశంలో ఫెడరేషన్ పెత్తనం, శిక్షణ వ్యవస్థ ప్రక్షాళన, ఫెడరేషన్లో అధ్వాన పరిపాలన, షెడ్యూల్ రెజ్లర్లను ఇబ్బందులు సృష్టించేలా తయారు చేయటం వంటి అంశాలను మల్లయోధులు క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్‌తో సమావేశంలో ప్రస్తావించారు. అయితే, వీటిపై పర్యవేక్షణ కమిటీ నివేదికలో ఎటువంటి ప్రస్తావన లేదని తెలుస్తోంది. పర్యవేక్షణ కమిటీ నివేదికను క్రీడామంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించలేదు. నివేదిక బహిర్గతమైతే, విచారణ ప్రక్రియ తీరుపై ఓ అభిప్రాయం రానుంది.