Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరగతి గదిలో తిరుగుతూనే ఉండాలి
- జాతీయ పాఠ్యప్రణాళిక నూతన ముసాయిదా(ఎన్సీఎఫ్) సిఫారసు
న్యూఢిల్లీ : పాఠశాల తరగతి గదిలో విద్యను బోధించే ఉపాధ్యాయులకు కూర్చునేందుకు కుర్చీలు ఇవ్వకూడదట ! వారు నిలువుకాళ్లపై నిలుచునో, అటూ ఇటూ తిరుగుతూనో పాఠాలు చెప్పాలట ! పాఠశాల విద్యకు సంబంధించిన జాతీయ పాఠ్యప్రణాళిక నూతన ముసాయిదా (ఎన్సీఎఫ్) ఈ మేరకు సిఫార్సు చేసింది. దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గతవారం విడుదల చేసింది. తరగతి గదిలో సింబల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముసాయిదా సూచించింది. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా చిహ్నాలు, దృశ్య రూపాలు, గోడలపై రాతలు, పెయింటింగులు, ప్రతిమలు, భౌతిక వస్తువులు వంటి వాటిని ఏర్పాటు చేయాలని తెలిపింది. ప్రధానోపాధ్యాయుడు కూర్చునే కుర్చీ, ఇతర ఉపాధ్యాయులు కూర్చునే కుర్చీలు భిన్నంగా ఉండాలని కూడా సూచించింది. సింబల్స్‌ను సమర్ధవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో బాధ్యులు నిర్ణయించుకోవాలని, దీనివల్ల విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకుంటూ మంచి వాతావరణంలో మెలగుతారని అభిప్రాయపడింది. తరగతి గదిలో విద్యార్థులు సర్కిల్లో కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని, దీనివల్ల వారు మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తారని తెలిపింది. ఉపాధ్యాయులను ఎనిమిది గంటల పాటు తరగతి గదిలో కూర్చునేందుకు అనుమతివ్వని కారణంగా 2019లో కేరళలోని తిరువనంతపురంలో ఒక ప్రముఖ పాఠశాల యాజమాన్యాన్ని జాతీయ మహిళా కమిషన్ మందలించింది. ఇప్పుడు జాతీయ పాఠ్యప్రణాళిక నూతన ముసాయిదా దీనికి పూర్తి భిన్నంగా ఉంది.