Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టికెట్ దక్కని నేతల తిరుగుబాటు
- పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ రాజీనామా
- రాజకీయాలకు మంత్రి అంగారా గుడ్‌బై
- టికెట్ ఇవ్వకున్నా పోటీ చేస్తానంటున్న జగదీశ్ షెట్టర్
బెంగళూరు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం 189 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించిన వెంటనే బీజేపీలో అసమ్మతి సెగలు రేగాయి. వరుసగా రెండోసారి అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ తొమ్మిది మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. వీరిలో ఒక మంత్రి, మరో మాజీ మంత్రి కూడా ఉన్నారు. సీనియర్లను పక్కనపెట్టి 52 కొత్త ముఖాలను అభ్యర్థులుగా ప్రకటించింది. దీనిపై కొందరు పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. జాబితాలో పేరు లేకపోవడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడి ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం ఒక బలమైన నిర్ణయానికి వస్తానని, శుక్రవారం నుంచి రంగంలోకి దిగుతానని ఆయన చెప్పారు. సావడి కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి అంగారా అయితే రాజకీయాలకు గుడ్‌బై చెప్పేశారు. దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ఈ నెల 20వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో బీజేపీలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. తిరుగుబాటుదారుల సంఖ్యపై అప్పటికి పూర్తి సమాచారం అందే అవకాశం ఉంది. ప్రస్తుత ఎమ్మెల్యేలలో అనిల్ బెనాకే (బెళగావి ఉత్తర), హలదీ శ్రీనివాస్ శెట్టి (కుండపురా), ఎస్. అంగార (సులియా), మహదేవప్ప శివలింగప్ప యాదవాద్ (రామదుర్గ్), రమణ లమానీ (షిరాహట్టి), డీఎం బసవంత్ (కిత్తూరు) సహా పలువురికి పార్టీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీనిపై యాదవాద్, బెనాకే మద్దతుదారులు తమ తమ నియోజకవర్గాల్లో ఇప్పటికే నిరసన గళం విన్పిస్తున్నారు.
ఉడిపిలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘుపతి భట్‌కు టికెట్ నిరాకరించిన బిజేపీ నాయకత్వం యశ్పాల్ సువర్ణకు అభ్యర్థిత్వం కట్టబెట్టింది. ఎన్నికల్లో పోటీ చేయడం సువర్ణకు ఇదే మొదటిసారి. అయితే గతంలో హిజాబ్ నిషేధంపై సువర్ణ చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. హిజాబ్‌పై నిషేధాన్ని సమర్ధిస్తూ సువర్ణ గత సంవత్సరం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. హిజాబ్ ధరించే హక్కు కోసం కొందరు ముస్లిం యువతులు కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా వారిని జాతి వ్యతిరేకులుగా సువర్ణ అభివర్ణించారు. మరోవైపు తనకు టికెట్ నిరాకరించడాన్ని భట్ బాహాటంగానే నిరసిస్తున్నారు. టికెట్ ఇస్తామంటూ చివరి నిమిషం వరకూ తనను ఊరించారని, చివరికి మొండిచేయి చూపారని ఆక్రోశం వెళ్లగక్కారు. టికెట్ ఇవ్వడం లేదని ముందుగానే చెప్పి ఉంటే సీనియర్ నేత ఈశ్వరప్ప మాదిరిగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండే వాడినని చెప్పారు. వాస్తవానికి ఈశ్వరప్పకు ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చునని వార్తలు వచ్చాయి. తనకు బదులుగా శివమొగ్గ సీటును కుమారుడికి ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు.
పుత్తూర్ ఎమ్మెల్యే, దక్షిణ కన్నడ బీజేపీ అధ్యక్షుడు సంజీవ మతందార్కు కూడా నిరాశే ఎదురైంది. ఆయన స్థానంలో ఆశా తిమ్మప్పకు టికెట్ లభించింది. పార్టీ ఎమ్మెల్యేలు గూలిహట్టి శేఖర్ (హోసదుర్గ), లాలాజీ ఆర్ మెండన్లకు కూడా మొండిచేయే చూపారు. విజయనగరకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌ది కూడా ఇదే పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న షికారిపురాలో ఆయన కుమారుడు బివై విజయేంద్రకు టికెట్ ఇచ్చారు. ఎన్నికలలో పోటీ చేయబోనని 80 సంవత్సరాల యడ్యూరప్ప ఇప్పటికే ప్రకటించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ అయితే తాను ఎన్నికలలో పోటీ చేసి తీరతానని తెగేసి చెప్పారు. పోటీకి దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం తనకు సూచించిందని, అయినప్పటికీ పోటీలో నిలవడం ఖాయమని అన్నారు.