Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ 'ఉపాధి' పనుల్లో రికార్డు
- పెరుగుతున్న పని దినాలు
- ప్రజల భాగస్వామ్యంతో ముందుకు
- మరిన్ని పథకాలలోనూ తనిఖీలు
- ఆన్లైన్లో 900 ప్రభుత్వ పథకాలు : విజయన్
కొచ్చి : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన పనులకు సంబంధించి పూర్తి స్థాయిలో సామాజిక తనిఖీలు నిర్వహించిన మొదటి రాష్ట్రంగా కేరళ రికార్డు సాధించింది. రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలలో గ్రామసభ సమావేశాలు నిర్వహించడం ద్వారా ఇది సాధ్యపడింది. 2022 అక్టోబర్ నుండి 2023 మార్చి వరకూ 941 స్థానిక సంస్థలలో (ఎల్ఎస్జీలు) 15,962 సామాజిక తనిఖీలు నిర్వహించారు. 2011వ సంవత్సరపు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి సామాజిక తనిఖీ నిబంధనల ప్రకారం నమోదైన ప్రైవేటు సంస్థ సోషల్ ఆడిట్ యూనిట్ (ఎస్ఏయూ) ఈ తనిఖీలు జరిపింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో విధిగా రెండుసార్లు సామాజిక తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. దీని ప్రకారం 2022 ఏప్రిల్, 2022 సెప్టెంబర్ మధ్యకాలంలో 683 స్థానిక సంస్థలలో 11,382 తనిఖీలు నిర్వహించారు. కేరళలో 941 స్థానిక సంస్థలు, 15,962 వార్డులు ఉన్నాయి.
ఉపాధి హామీ చట్టం కింద రాష్ట్రంలో రూ. 4,000 కోట్ల విలువైన పనులు చేశారు. వీటిలో కేవలం రూ. 1.03 కోట్ల (మొత్తం విలువలో 0.02 శాతం) పనులకు సంబంధించి మాత్రం అవకతవకలు జరిగాయని తనిఖీలో గుర్తించారు. వీటికి బాధ్యులైన వారిని గుర్తించి, వారి నుండి సొమ్మును రాబట్టేందుకు చర్యలు ప్రారంభించారు.
సామాజిక తనిఖీలు పూర్తయిన సందర్భాన్ని పుర స్కరించుకొని ఈ నెల 10న బహిరంగసభ నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రసంగిస్తూ రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు సంబంధించి తనిఖీ నివేదికలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 'చాలా మందికి సామాజిక తనిఖీ అనే పదం కొత్తగా అనిపిస్తుంది. కానీ ఎల్డీఎఫ్ ప్రభుత్వం పాతికేళ్ల క్రితమే ప్రజా ప్రణాళికల కింద ఇలాంటి పథకాలను ప్రారంభించింది' అని తెలిపారు. ఈ సంవత్సరం మే నాటికి ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా 900 ప్రభుత్వ పథకాలు ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తున్నందుకు కేరళపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దీని కింద ప్రతి కుటుంబానికీ 53.8 పని దినాలు (జాతీయ సగటు 8 శాతం) లభిస్తున్నాయి. అర్హులైన 31 శాతం కుటుంబాలకు 100 (జాతీయ సగటు 50 శాతం) పని దినాలు దొరుకుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా సగటు పని దినాల సంఖ్య తగ్గిపోగా కేరళలో మాత్రం పెరిగింది. 2021-22లో 10.23 లక్షల నుండి 2022-23లో 10.58కి పెరిగింది. ప్రజల భాగస్వామ్యం తో ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా కృషి చేస్తున్నామని విజయన్ తెలిపారు.
ప్రారంభంలో ఎస్ఏయూ తన పనిని నిదానంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత తనకు అప్పగించిన పనిలో వేగాన్ని పెంచింది. ఇందులో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అసలైన లబ్డిదారులకు పథకం ప్రయోజనాలు చేకూరాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం. అనేక సవాళ్లు ఎదురవు తున్నా, కేంద్రం సరిగా నిధులు కేటాయించకపోయినా పథకాన్ని విజయవంతంగా ముందుకు తీసికెళుతున్నారు. 2018 వరకూ కేవలం కొన్ని పంచాయతీలలో మాత్రమే సామాజిక తనిఖీలు జరిగాయని, స్థానిక సంస్థల వ్యవహారాల మంత్రి జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు రాష్ట్ర మంతటా ఆడిట్ పూర్తయిందని ఎస్ఏయూ డైరెక్టర్ రమాకాంతన్ చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పీఎంఏవై, ఆరోగ్య కేరళ వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టులకు కూడా ఇదే తరహాలో సామాజిక తనిఖీలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.