Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదరికంపై సర్వేలలో అవాస్తవాలు...వక్రీకరణలు
- అరకొర సమాచారం....దాటవేతలు
న్యూఢిల్లీ : భారత్‌లో పేదరికం వేగవంతంగా తగ్గిపోతోందంటూ వెలువడుతున్న సర్వేలు నిజమేనని మీరు నమ్ముతున్నారా ? అయితే మరోసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ సర్వేల గణాంకాలన్నీ అవాస్తవాలే. వక్రీకరణలే. సర్వేలలో అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోకపోవడం, ఒకవేళ తీసుకున్నా అరకొర సమాచారంతో నింపడం, వాస్తవాలను మరుగుపరచడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉన్నదో తెలుసు కునేందుకు వినియోగ వ్యయ సర్వేలపై (సీఈఎస్లు) ఆధారపడు తుంటాము. ప్రజల తలసరి వ్యయం పేదరిక స్థాయి కంటే తక్కువగా ఉన్నదా లేదా అని ఈ సర్వేలు అంచనా వేస్తాయి. అయితే కేంద్రప్రభుత్వ అలసత్వం కారణంగా ఇలాంటి సర్వే నిర్వహించి దాదాపు దశాబ్దం పైనే అయింది. అంటే గడచిన దశాబ్ద కాలంలో దేశంలో పేదరికం ఎలా ఉన్నదో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయిందన్న మాట. ఇదిలావుంటే ఈ కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్న సీఎంఐఈ అనే సంస్థ పలు రకాల సర్వేలు చేపట్టింది. వినియోగ వ్యయ గణాంకాలను తెలుసుకునేందుకు ఇవి ఉపకరిస్తాయి. ఈ సమాచారం ఆదారంగా పేదరికం పైన కూడా అంచనాకు రావచ్చు. అయితే ఇలాంటి సర్వేలలో పేదల అభిప్రాయాలకు పెద్దగా చోటు దక్కదు. ఉదాహరణకు దేశంలో అత్యంత పేద రాష్ట్రమైన బీహార్ లోని ఇళ్లలో తాగునీరు, మరుగు దొడ్లు, టెలివిజన్ వంటి సౌకర్యాలు బాగానే ఉన్నాయని ఓ సర్వే కట్టుకథలు అల్లింది.
అంతేకాదు... ఈ సర్వేల ఫలితాలలో వివక్ష కూడా కన్పిస్తుంది. ఒక సర్వే ఏం చెప్పిందంటే 2018లో ప్రాధమిక స్థాయి విద్య కూడా చదవని వయోజనుల సంఖ్య కేవలం రెండు శాతమేనట !. మరో సర్వే ఈ సంఖ్యను 17 శాతంగా చూపింది. ఎంత తేడా ఉన్నదో గమనించండి. ప్రపంచబ్యాంక్‌కు చెందిన ఆర్థికవేత్తలు సిన్హా రారు, రారు వందర్ వెయిడ్లు సర్వేలు వివక్షాపూరితంగా ఉంటున్నాయని అంగీకరించారు. దీనిని నివారించేందుకు వారు కొన్ని పద్ధతులను కూడా సూచించారు.
వీటి ప్రకారం ముందుగా సర్వేలు పరిగణనలోకి తీసుకునే సామాజిక, ఆర్థిక అంశాలను గుర్తిస్తారు. అంటే విద్య, వృత్తి, ఆస్థి వంటివి. వీటిపై ఆయా సర్వే సంస్థలు నిర్ధారణకు వచ్చిన అంశాలను క్రోడీకరిస్తారు. వాటి ఆధారంగా పేదరిక అంచనాలు రూపొందిస్తారు. ముఖ్యంగా నెలసరి తలసరి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. విద్య, వృత్తి వంటి అంశాలనూ పరిశీలిస్తారు. కొన్ని సంస్థలు తీసుకునే అంశాలు విశ్వసించదగినవే అయినప్పటికీ అంతా వాస్తవమేనని భావించడానికి లేదు. సర్వేలు నిర్వహించే సంస్థలు కొన్ని విషయాలను దాటవేయవచ్చు. ఉదాహరణకు అనారోగ్యం, పంట నష్టాలు వంటివి. వీటిని విస్మరించి పేదరికాన్ని ఎలా అంచనా వేయగలం ? నిరుపేదలైన ప్రజలను విస్మరించి నమూనాలు సేకరించడం వాస్తవ పరిస్థితిని వక్రీకరించడమే అవుతుంది.
వాస్తవ చిత్రాన్ని ఎలా వక్రీకరిస్తారో చూద్దాం. నిరుపేదలైన ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలను పరిగణనలోకి తీసుకోకుండా సర్వేలు రూపొందిస్తారు. దినసరి కార్మికులను, విద్య తక్కువగా ఉన్న వారిని ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తారు. దీనివల్ల వాస్తవాలు ఎలా బయటపడతాయి ? కొన్ని సర్వేలలో మాత్రం తక్కువ సంఖ్యలో ఎస్సీలు, ఎస్టీలను గమనంలోకి తీసుకొని 'మమ' అనిపిస్తున్నారు.
దీనిని బట్టి చూస్తే చాలా సర్వేలు అవాస్తవాలతో, కట్టుకథలతో కూడి ఉంటున్నాయి. 2011-2019 మధ్యకాలంలో పేదరికం తగ్గిదంటూ కొన్ని సర్వేలు వక్రీకరణలతో కూడిన గణాంకాలు విడుదల చేశాయి. ఈ సర్వేలు అందిస్తున్న వివరాలను చూస్తుంటే వాటి విశ్వసనీయత పైన అనుమానాలు వ్యక్తం కావడం సహజమే.